‘కేర్‌ లెస్‌’ ప్రొవైడర్స్‌

3 Jan, 2019 08:32 IST|Sakshi

కాంట్రాక్టర్లతో అధికారుల కుమ్మక్కు..సగం మంది గైర్హాజరు..

పక్కాగా బిల్లుల చెల్లింపు ఉన్నవారు కూడా రోగులను పట్టించుకోని వైనం  

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే నిరుపేద రోగుల్లో చాలా మంది నిరక్ష రాశ్యులు కావడంతో ఆస్పత్రిలో ఏ డాక్టర్‌ ఎక్కడ ఉంటాడో? ఏ వార్డు ఎక్కడ ఉంటుందో? ఏ పరీక్ష ఎక్కడ చేస్తారో? వారికి తెలియదు. వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆస్పత్రుల వారీగా పేషెంట్‌ కేర్‌ ప్రొవైడర్స్‌ సర్వీసులను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన ఈ సేవలు ప్రస్తుతం ‘కేర్‌ లెస్‌’గా మారాయి. ఆస్పత్రుల్లో ప్రభుత్వం కే టాయించినంత మంది లేక పోగా..ఉన్నవారు కూడా రోగులకు బదులు వైద్యాధికారుల వ్యక్తిగత సేవలకే పరిమితమవుతున్నారు. ఫలితంగా ఆస్పత్రుల్లో ఈ సేవలు ఉన్నా..లేనట్లుగానే తయారైంది. ఎప్పటికప్పుడు సేవలపై ఆరా తీసి, మెరుగుపర్చాల్సిన ఉన్నతాధికారులు ఇవేవీ పట్టించుకోడం లేదు. ఫలితంగా కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.   

విధుల్లో లేకపోయినా..పక్కగా బిల్లులు...  
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వార్డుబోయ్స్‌ ఖాళీలు భారీగా ఉన్నాయి. ఏళ్ల తరబడి ఈ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో రోగులకు కనీస సేవలు అందించేందుకు ప్రభుత్వం తాత్కాలిక ప్రతిపాదికన రెండేళ్ల క్రితం పేషంట్‌ కేర్‌ ప్రొవైడర్స్‌ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఉస్మానియాలో 217 మంది, నిలోఫర్‌లో 90 మంది, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో 28 మంది, గాంధీలో 7, ఉస్మానియా వైద్య కాలేజీలో 83 మంది, సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో 56 మంది, ఫీవర్‌ ఆస్పత్రి లో 20 మందిని ఔట్‌ సోర్సింగ్‌ ప్రతిపాదికన పేషంట్‌ కేర్‌ ప్రొవైడర్స్‌గా నియమించింది. వీరిలో సగం మంది ఆస్పత్రికే రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. విధులకు వచ్చిన వారు కూడా అసలు డ్యూటీకి బదులే వేరే పనులు చేస్తూ పేషెంట్‌ కేర్‌ను పూర్తిగా గాలికొదిలేశారు. నీలోఫర్‌ ఆస్పత్రిలో 90 మంది ఉండగా, ఒక్కో షిప్ట్‌లో 30 మంది చొప్పున మూడు షిఫ్ట్‌ల్లో పని చేయాల్సి ఉండగా, వీరిలో సగం మంది కూడా కన్పించడం లేదు. అయితే సదరు కాంట్రాక్టర్‌ మాత్రం వంద శాతం హాజరు చూపుతుండటం, ఆ మేరకు బిల్లులు జారీ చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్‌ఎంఓలు ఈ విషయాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 

అసలు లక్ష్యం ఇదీ!
వార్డు బాయ్స్‌ స్థానంలో పేషెంట్‌ కేర్‌ ప్రొవైడర్స్‌ను నియమించింది. ఆస్పత్రికి వచ్చిన రోగికి వీరు అండగా ఉండాల్సి ఉంటుంది. ఏ వార్డు ఎక్కడుందో చెప్పడంతో పాటు ఏ జబ్బుతో బాధపడుతున్న వారు ఏ వైద్యుడి వద్దకు వెళ్లాలో సూచించాలి. ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్‌ఐ తదితర పరీక్షల కోసం డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌ వద్దకు తీసుకెళ్లడం, సేకరించిన రక్తపు నమూనాలను ల్యాబ్‌కు పంపించాలి. ఆస్పత్రిలో అడ్మిటైన ఇన్‌పేషంట్‌కు సహాయకుడిగానూ పని చేయాలి. వీల్‌ చైర్‌పై లేదా స్ట్రెచర్‌పై ఒక చోటి నుంచి మరో చోటికి తరలించడం మొదలు.... పడకలపై ఉన్న దుప్పట్లను ఎప్పటికప్పుడు మార్చడం.... ఒక వేళ వార్డులోని రోగు ల్లో ఎవరైనా మల, మూత్ర విసర్జన కోసం వెళ్లాలని భావిస్తే..వారిని టాయ్‌లెట్‌కు తీసుకెళ్లడం వరకు ఇలాంటి అన్ని పనులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం వీరెవరూ ఆ పనులు చేయక పోవడంతో రోగుల బంధువులే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది.

ఆస్పత్రుల్లో ఆరోగ్య దూతలు
పేషెంట్‌ కేర్‌ సర్వీసు ప్రొవైడర్స్‌ లేక ఇబ్బంది పడుతున్న ఇన్‌ పేషెంట్లకు సేవలను అందించేందుకు హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు మిషన్‌ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ పావర్టీ ఇన్‌ మున్సిపల్‌ ఏరియా(ఎంఇపీఎంఏ)కింద హోమ్‌ కేర్, బెడ్‌సైడ్‌ కేర్‌లో శిక్షణ పొందిన ఆరోగ్య దూతలను నగరంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నియమించింది. ఇందులో భాగంగా ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో 14 మంది, ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రిలో ఇద్దరు, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో నలుగురిని నియమించింది. ప్రమాదవశాత్తూ రోడ్డు, అగ్ని ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన బాధితులు, వృద్ధులతో పాటు అల్సర్, కేన్సర్‌ తదితర దీర్ఘ కాలిక రోగాలతో బాధపడుతున్న నిరుపేదలకు వీరు సేవలు అందిస్తారు. రోగులకు ఆహారం అందించడం మొదలు...పడకలను సిద్ధం చేయడం, ఉదయం నిద్ర లేవగానే బ్రస్‌ చేయించి, ముఖం కడగడం,  చేతి, కాలి వేళ్లకు ఉన్న గోళ్లను కత్తిరించడం, తల, జుట్టు సంరక్షణ, స్నానం చేయిం చడం, ఎప్పటికప్పుడు గాయాలను శుభ్రం చేయడం, డ్రెస్సులు, డైపర్లు మార్చడం వరకు... ఇలా అన్ని పనుల్లోనూ రోగులకు సహాయంగా ఉంటారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు