నిలోఫర్‌లో గందరగోళం.. సిబ్బందిపై ఆరోపణలు

18 Apr, 2018 12:55 IST|Sakshi
నిలోఫర్‌ హాస్పిటల్‌

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ప్రముఖ చిన్నపిల్లల హాస్పిటల్‌ నిలోఫర్‌లో బుధవారం గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జియాగూడకు చెందిన 3 నెలల బాలుడు ధృవన్‌కు జ్వరం రావడంతో తల్లిదండ్రులు నిలోఫర్‌కు తీసుకొచ్చారు. బాబుకు పరీక్షలు చేసిన వైద్యులు.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించారు. ఆ తర్వాత బాలుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో తల్లిదండ్రులు వైద్యం నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని, A పాజిటివ్‌ రక్తానికి బదులు ‘0’ పాజిటివ్‌ రక్తం ఎక్కించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని ఆసుపత్రి యాజమాన్యం బెదిరింపులకు దిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

అవగాహనా రాహిత్యం వల్లే..
కాగా, ధృవన్‌ అంశంపై నిలోఫర్‌ సూపరెండెంట్‌ మురళీకృష్ణ స్పందించారు. బాలుడు ధృవన్‌ ఆరోగ్యం బాగుందని స్పష్టం చేశారు. అవగాహనా రాహిత్యం వల్ల బాలుడి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారన్నారు. ఆరు నెలల వరకు బ్లడ్‌ గ్రూప్‌ నిర్థారణ కాదని, ‘0’ గ్రూప్‌ విశ్వధాత కావున సదరు బ్లడ్‌ గ్రూప్‌ బాబుకి ఎక్కించామని ఆయన వెల్లడించారు. రక్తం ఎక్కించిన తర్వాత బాలుడికి ఎలాంటి ఇబ్బంది జరుగలేదన్నారు. ధృవన్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడని, ప్రస్తుతం బాబుకు ప్రాణాపాయం లేదని వివరించారు.

మరిన్ని వార్తలు