ఈఎస్‌ఐ వైద్యం.. భరోసాకు దూరం

27 Aug, 2018 09:33 IST|Sakshi
అధికారుల తీరును వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన రోగులు (ఫైల్‌)

తాజాగా డయాలసిస్‌ సేవల ఉపసంహరణ

ఆందోళనలో కిడ్నీ ఫెయిల్యూర్‌ బాధితులు

సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వైద్య సేవలు అధ్వానంగా మారుతున్నాయి. అనారోగ్యంతో ఈ ఆస్పత్రికి వస్తున్న రోగులు సరైన సేవలు అందక నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా ఇక్కడ డయాలసిస్‌ సేవల్ని ఉపసంహరించారు. దీంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండా సేవలు నిలిపి వేస్తే ఎలా అని రోగులు, వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎంఆర్‌ఐ స్కానింగ్‌ సేవలు అందాలంటే రెండు నెలలపాటు నిరీక్షించాల్సిన దుస్థితి ఇక్కడ నెలకొంది. ఈ బాధలు భరించలేని కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

అమీర్‌పేట్‌/సాక్షి, సిటీబ్యూరో:ఈఎస్‌ఐ ఆస్పత్రి అంటే ఓ భరోసా..ఓ ధైర్యం.. నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందుతుందనే నమ్మకం.. ఇప్పుడు సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రి ఆపేరును చెరిపేసుకుంటోంది. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి చేరుకున్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఈఎస్‌ఐ ఆస్పత్రి కనీస భరోసా ఇవ్వలేకపోతోంది. ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యపరికరాలు సమకూర్చుకుని రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రి వైద్యసేవలను విస్మరిస్తుంది. తాజాగా ఆస్పత్రిలో డయాలసిస్‌ సేవలు అందించే ఏజేన్సీ పనితీరు సరిగా లేదని పేర్కొంటూ ఆ సేవలను నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ముందస్తు సమాచారం కూడా లేకుండా సేవలను నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని రోగులు, వారి తరపు బంధువులు ప్రశ్నిస్తున్నారు.  

గడువున్నా..ఒప్పందం రదు...
మూత్ర పిండాల పనితీరు దెబ్బతిన్న రోగులకు డయాలసిస్‌ చేస్తుంటారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 1500 మంది బాధితులు వైద్యసేవలు పొందుతున్నారు. సమస్య తీవ్రతను బట్టి కొందరికి వారంలో మూడుసార్లు డయాలసిస్‌ చేయాల్సి ఉంది. ఒక్కో బృందంలో 310 మందికి డయాలసిస్‌ చేస్తున్నా రు. ఈ సేవలను నెఫ్రోప్లస్‌ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ సంస్థకు ఇచ్చిన గడువు ఇంకా కొంత కాలం ఉంది. అయితే ఉన్నట్టుండి ఈ సంస్థతో సేవలను ఈఎస్‌ఐ రద్దు చేసుకుంది. ప్రత్యామ్నాయంగా డయాలసిస్‌ కోసం నగరంలో ఐదు ఆసుపత్రులను ఎంపిక చేసింది. అక్కడకు వెళ్లాలని రోగులకు సూచిం చింది. అకస్మా త్తుగా సేవలను ఎత్తివేయడంపై రోగులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే డయాలసిస్‌ కాంటాక్ట్‌ దక్కించుకున్న సంస్థ పనితీరు సరిగా లేనందు వల్లే సేవలను ఉపసంహరించుకున్నట్లు ఈఎస్‌ఐసీ సూపర్‌స్పెషాలిటీ డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కీర్తి ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా ఐదు ఆస్పత్రులను ఇందుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఎంఆర్‌ఐకి రెండు నెలలు...  
ఆస్పత్రిలో ఆరు సూపర్‌ స్పెషాలిటీ విభాగాలతో పాటు 16 సాధారణ చికిత్సల విభాగాలు ఉన్నాయి. సుమారు 380 పడకలు ఉన్న ఈ ఆస్పత్రి అవుట్‌ పేషంట్‌ విభాగానికి రోజుకు సగటున 500 మంది రోగులు వస్తుంటారు. ఆస్పత్రిలో నిత్యం 350 మందికిపైగా చికిత్స పొందుతుంటారు. క్షతగాత్రులతో పాటు తల నొప్పి, వెన్ను పూస నొప్పులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న బాధితులు ఉంటారు. వీరిలో చాలా మందికి సీటీ, ఎంఆర్‌ఐ టెస్టులు అవసరం ఉంటుంది. వైద్యులు రాసిన చీటీ తీసుకుని ఎంఆర్‌ఐ విభాగానికి వెళ్తే..రెండు నెలల తర్వాత రావాల్సిందిగా సూచిస్తున్నారు. అప్పటికే వ్యాధి తీవ్రత మరింత ముదిరి ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. చేసేది లేక కొంత మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆస్పత్రిలో రెండు అధునాతన ఎంఆర్‌ఐ మిషన్లు ఉన్నా సకాలంలో సేవలు అందకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు