ఇంట్లోనే ఉండండి.. ధ్యానం చేయండి

31 Mar, 2020 03:15 IST|Sakshi

వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి..

కరోనా వైరస్‌ త్వరగా సోకే ప్రమాదం

కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా బారినపడకుండా వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సూచించింది. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వృద్ధుల్లో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండటం వల్ల వైరస్‌ బారినపడే ప్రమాదముందని తెలిపింది. అలాగే డయాబెటిస్, రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాల, శ్వాసకోశ వ్యాధి లక్షణాలు కూడా కొందరిలో ఎక్కువగా ఉంటాయని, వైరస్‌ కారణంగా వృద్ధుల మరణాలు పెరిగితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.

అవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దు..
♦ ఇంట్లోనే ఉండాలి. సందర్శకులను కలవరాదు. తప్పనిసరై కలవాల్సి వస్తే మీటరు దూరంలో ఉండి మాట్లాడాలి.
♦  సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులు, ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
♦  దగ్గు, తుమ్ము, వస్తే మోచేతిని అడ్డం పెట్టుకోవాలి. లేదా టిష్యూ పేపర్, చేతి రుమాలును అడ్డుగా ఉంచుకోవాలి.
♦  దగ్గు లేదా తుమ్ముకు వాడిన టిష్యూ పేపర్‌ను పారవేయాలి. రుమాలునైతే ఉతకాలి.
♦  ఇంట్లో వండిన తాజా వేడి భోజనం తినాలి. తీసుకునే ఆహారంలో అధికంగా పోషకాలు ఉండేలా చూసుకోవాలి.
♦  రోగనిరోధక శక్తి కోసం తాజా పండ్ల రసాలను తీసుకోవాలి. 
♦  వ్యాయామం, ధ్యానం చేయాలి.
♦  రోజువారీ సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
♦  కుటుంబసభ్యులు, స్నేహితులతో ఫోన్‌ కాల్‌ లేదా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడాలి.
♦  కంటి శుక్లం లేదా మోకాలి మార్పిడి వంటి ఆపరేషన్లను వాయిదా వేసుకోవాలి.
♦  వృద్ధులు తాకిన పర్నిచర్‌ను క్రమం తప్పకుండా క్రిమిసంహారక మందులతో కడగాలి.
♦  జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. సొంత వైద్యం పనికిరాదు.
♦  జ్వరం, దగ్గుతో బాధపడుతుంటే కనుక.. కళ్లు, ముఖం, ముక్కు, నాలుకను తాకవద్దు.
♦  బాధిత లేదా అనారోగ్య వ్యక్తుల దగ్గరకు వెళ్లవద్దు.
♦  ఎవరితోనూ కరచాలనం చేయవద్దు. స్నేహితులను, సమీప బంధువులను కౌగిలించుకోవద్దు.
♦  సాధారణ తనిఖీ కోసం ఆసుపత్రికి వెళ్లవద్దు. సమస్య ఉంటే, కుటుంబ డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి నిర్ధారించుకోవాలి.
♦  పార్కులు, మార్కెట్లు, మతపరమైన ప్రదేశాలు, ఇతర రద్దీ ప్రదేశాలకు వెళ్లవద్దు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు.

మరిన్ని వార్తలు