దుప్పట్లు.. ఇక్కట్లు

27 Dec, 2019 10:39 IST|Sakshi
ఉస్మానియా ఆస్పత్రి ఇన్‌పేషెంట్‌ వార్డులో తమ వెంట తెచ్చుకున్న దుప్పట్లతో రోగులు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్ల అవస్థలు

సప్తవర్ణాలని... రెండుతో సరిపెట్టారు

చలిని రోగులు తట్టుకునేదెలా...

ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఏడురోజులు..ఏడు రంగుల దుప్పట్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించినా, అది ఆచరణలో సాధ్యం కాలేదు. వైట్, పింక్‌ కలర్‌ దుప్పట్లు ఇచ్చి సరిపెట్టారు. చలికాలం సీజన్‌ మొదలై రెండు నెలలు గడుస్తున్నా దుప్పట్ల పంపిణీ సంగతి దేవుడెరుగు..కనీసం వాటికోసం ప్రతిపాదనలు కూడా తయారు చేయలేదంటే... ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగుల పట్ల అధికారులకున్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.  

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు దుప్పట్లు లేక చలికి గజగజ వణికిపోతున్నారు. జనవరి నెల నాటికి చలితీవ్రత పెరిగే అవకాశమున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, సుల్తాన్‌బజార్, ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి, కింగ్‌కోఠి, పేట్లబురుజు, నిమ్స్, ఫీవర్, ఈఎన్‌టీ, ఛాతి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, మానసిక చికిత్సలయాల్లో చికిత్స పొందుతున్న వృద్ధులు, శిశువులు, బాలింతలు, గర్భిణులు, ఇతర రోగులు విలవిల్లాడుతున్నారు. అసలే అనారోగ్యం..ఆపై చలేస్తే కప్పుకునేందుకు దుప్పటి కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇక రోగులకు సహాయంగా వచ్చిన బంధువుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్‌లో నైట్‌ షైల్టర్లు ఏర్పాటు చేసినా, అక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు.  

ఏడన్నారు..రెండిచ్చారు...
ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు ఇన్‌ఫెక్షన్ల భారిన పడకుండా చూసేందుకు ప్రభుత్వం రోజుకో దుప్పటి చొప్పున ఏడు రంగుల దుప్పట్లను సరఫరా చేయాలని భావించింది. ఆదివారం–బూడిద రంగు, సోమవారం–తెలుగుపురంగు. మంగళవారం–గులాబీరంగు, బుధవారం–ఆకుపచ్చరంగు, గురువారం పసుపుపచ్చరంగు, శుక్రవారం–ఊదారంగు, శనివారం–నీలిరంగు దుప్పట్లు అందజేస్తామని ప్రకటించింది. ఆ మేరకు 2016 ఆగస్టు 27న నగరంలోని ఉస్మానియా, గాంధీ సహా అనుబంధ ఆస్పత్రులకు సుమారు 12 వేల దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఏడు రోజులకు ఏడు రంగులు సరఫరా చేయడం సాధ్యం కాదని, వైట్, పింక్‌ రంగులకు పరిమితం చేసింది.

ఆ తర్వాత దుప్పట్ల సరఫరా నిలిపివేయడంతో ఆయా ఆస్పత్రులే సొంత నిధులతో కొనుగోలు చేయాల్సి వస్తుంది. కొన్ని ఆస్పత్రులు జైళ్లశాఖ తయారు చేసిన దుప్పట్లను కొనుగోలు చేశాయి. ప్రభుత్వం ఆస్పత్రులకు బడ్జెట్‌ కేటాయింపులు తగ్గించడంతో అధికారులు దుప్పట్ల కొనుగోలు నిలిపివేశారు. అప్పుడు కొనుగోలు చేసినవాటిలో చాలా వరకు చిరిగిపోగా, మిగిలినవాటిలో మరికొన్ని రోగులు డిశ్చార్జి అయ్యాక తమవెంట తీసుకెళ్లారు. ప్రస్తుతం చాలా పడకలపై దుప్పట్లు కన్పించడం లేదు. ఎప్పటికప్పుడు రోగుల అవసరాలకు అనుగుణంగా దుప్పట్లు కొనుగోలు చేయాల్సి ఉండగా, దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. అసలే చలికాలం..ఆపై అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు చేరుకున్న క్షతగాత్రులకు కప్పుకునేందుకు పడకపై దుప్పటి కూడా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌ ఆస్పత్రుల్లో ఇలా ఉంటే రోగుల నుంచి వైద్య ఖర్చులు వసూలు చేస్తున్న నిమ్స్‌లోనూ దుప్పట్లు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   

ఇటు చలి..అటు డెంగీ దోమలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏ మంచంపై చూసినా పూర్తిగా మాసిపోయి, చిరిగిపోయిన పరుపులే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి వీటిని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. గత్యంతరం లేక వీటిని కప్పుకున్న రోగులుకు ఇన్‌ఫెక్షన్‌ సోకుతోంది. ఆస్పత్రిలో డెంగీ, మలేరియా దోమలు స్వైర విహారం చేస్తుండటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న దుప్పట్లు కూడా రోగులకు ఇవ్వకుండా బీరువాల్లోనే భద్రపరుస్తున్నారనే ఆరోపణలున్నాయి.  దీంతో రోగులే సొంతంగా దుప్పట్లు సమకూర్చుకోవాల్సి వస్తోంది. పొరపాటున ఎవరైనా దుప్పటి తెచ్చుకోక పోతే రాత్రంగా చలికి వణకాల్సిందే. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన దుప్పట్ల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటి వరకు తయారు చేయలేదు.

మరిన్ని వార్తలు