ఒక రోగి ఎన్ని ఓపీ కార్డులు తేవాలి..?

1 Feb, 2020 08:31 IST|Sakshi

నిమ్స్‌లో ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ఒక ఓపీ కార్డును తీసుకోవాల్సిందేనని రోగులకు అధికారుల హుకుం

ఇదేం చోద్యమంటున్న రోగులు దోపిడీకి గురవుతున్న పేదలు

సాక్షి, సిటీబ్యూరో: నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో రోగులు దోపిడీకి గురవుతున్నారు. నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్య సేవలను అందిస్తున్న దృక్ఫథంతో తెలంగాణ ప్రభుత్వం నిమ్స్‌ ఆసుపత్రిని ప్రత్యేక తరహాలో నిర్వహిస్తోంది. అయితే స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన ఈ ఆసుపత్రిలో పాలకులు చిత్తం వచ్చినట్టు నియమ నిబంధనలు విధించడంతో రోగుల పాలిట శాపంగా మారింది. అభివృద్ధి పేరిట, ప్రభుత్వం వద్ద తాము ఆదాయం వనరులను చూపించే క్రమంలో ఆసుపత్రి యాజమాన్యం తమకు తోచిన విధంగా రూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శ లేకపోలేదు. పెరుగుతున్న రోగులకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన యాజ మాన్యం వారికి భారంగా తయారైందనే వ్యాఖ్యలు సర్వత్రా వినవస్తున్నాయి.

ఓపీ కార్డులు తీసుకోవాల్సిందే..
ఆస్పత్రి ఒక్కటే అయినప్పటికీ రెండు మూడు ఓపీ కార్డులు తీసుకోవాల్సిన పరిస్థితి. ఏ డిపార్టుమెంట్‌కు ఆ డిపార్టుమెంట్‌ ఓపీ కౌంటర్‌లో ఓపీ కార్డు తీసుకోవాల్సిందేనని నిమ్స్‌ ఉద్యోగులు హుకుం జారీ చేస్తున్నారు. బుధవారం ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగయ్య అనే రోగి శస్త్ర చికిత్స నిమిత్తం నిమ్స్‌ను వచ్చాడు. సర్జకల్‌ ఆంకాలజీ విభాగంలో ఓపీ కార్డు తీసుకొని వైద్యుడిని సంప్రదించారు. ఆయనను పరీక్షించిన ఆ విభాగం వైద్యులు. కేసు క్రిటికల్‌గా ఉంది. ఒకసారి కార్డియాలజీ విభాగంలో చూపించుకోవాల్సిందిగా సూచించారు. దాంతో అక్కడి వైద్యుడిని కలవడానికి వెళ్లగా ఓపీ కార్డు తీసుకురమ్మని సిబ్బంది ఆదేశించారు. అదేంటి ఓపీ కార్డు తీసుకున్నాం కదా అని.. సర్జికల్‌ ఆంకాలజీ విభాగానికి సంబంధించి తీసుకున్న ఓపీ కార్డును సంగయ్య సహాయకురాలు చూపించారు. ఇది.. కార్డియాలజీ ఓపీలో కార్డు తీసుకురావాలని చెప్పారు. ఒక రోజుకు ఒకే రోగి రెండు, మూడు ఓపీ కార్డులను తీసుకోవడమంటే ఎంత వరకు సమంజమని రోగి సహాయకులు ప్రశ్నిస్తున్నారు. నిమ్స్‌ యాజమాన్య వైఖరిపై ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్‌చెరువుకు చెందిన రోగి సహయకుడు సంజయ్‌ అభిప్రాయపడుతున్నారు.

గతంలో అయితే..
గతంలో అయితే ఒకసారి ఓపీ కార్డు తీసుకుంటే ఆ కార్డు మీద దాదాపుగా 15 రోజులు వైద్యులను సంప్రందించడానికి అవకాశం ఉండేది. అప్పట్లో ఓపీ కార్డు కూడా కేవలం రూ. 50లకే జారీ చేసేవాళ్లు. దాంతోనే ఆసు పత్రిలోని 28 సూపరు స్పెషాలిటీ విభా గాలల్లోనూ ఆయా వైద్యులను కలుసుకునే వెలుసుబాటు రోగులకు ఉండేది. అలాంటిది.. యాజమాన్యం తాజాగా తీసుకున్న నిర్ణ యాల వల్ల ఓపీ కార్డు కూడా మొబైల్‌కి వచ్చే ఓటీపీ చందంగా తయారైందని పలువురు రోగులు, వారి సహాయకులు వాపోతున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రిలో కూడా ఈ విధమైన వైఖరి లేదనీ, ఇక్కడ అంతకు మించి దోపిడీ జరుగుతుందన్నారు.

ఏ విభాగానికి ఆ ఓపీ కార్డు ప్రత్యేకం..
ఓపీ కార్డు విషయమై సంబంధిత ఆర్‌ఎంఓని సంప్రదించగా ఆసుపత్రి వైద్యసేవలన్నీ కంప్యూటీకరణ చేయడం జరిగిందని చెప్పారు. దాని వల్ల ఏ డిపార్టుమెంట్‌కు ఆ డిపార్టుమెంట్‌కు సంబంధించి విధిగా ఓపీ కార్డు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఆయా విభాగాలలో ప్రత్యేకంగా ఓపీ కార్డులను జారీ చేస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని ఆసుపత్రి పరిపాలనా అధికారి కూడా ధ్రువీకరించడం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా