ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో డబ్బు చెల్లించాలి

6 Jun, 2014 23:48 IST|Sakshi
ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో డబ్బు చెల్లించాలి

మెదక్ మున్సిపాలిటీ,న్యూస్‌లైన్:  రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ ఆదేశించారు. శుక్రవారం మెదక్ వచ్చిన ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పౌర సరఫరాలు, ఐకేపీ, పంచాయతీరాజ్ ఇంజనీర్‌లు, తహశీల్దార్‌లు, సివిల్ సప్లయ్ డిప్యూటీ తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే కేంద్రాల్లోని ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. అలా చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించని పాపన్నపేట డిప్యూటీ తహశీల్దార్, సివిల్ సప్లయ్ అధికారికి మెమో జారీ చేయాల్సిందిగా జిల్లా పౌరసరఫరాల అధికారి రత్నంను ఆదేశించారు. కొనుగోలు కోసం ఎంత ధాన్యం వస్తుంది...ఎన్ని రోజుల్లో కొనుగోలు చేస్తారో అంచనా వేసుకున్నాకే కేంద్రాలను మూసివేయాలన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం వివరాల నమోదులో ఎలాంటి జాప్యం చేయరాదన్నారు. అదే విధంగా కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

 జిల్లాలో 70 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నాయని, బియ్యంతోపాటు ఇతర సరుకులు కూడా సరైన సమయంలో చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీకి సిద్ధం చేయాలని ఆయన సూచించారు. డీడీలు సకాలంలో చెల్లించని డీలర్లపై శాఖాపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత తహశీల్దార్లపై ఉందన్నారు. గతంలో గుర్తించిన ప్రభుత్వ భూముల్లో బోర్డులు పాతడంతో పాటు చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, ఈ పనిని పది రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ వనజాదేవి, డీఎస్‌ఓ ఏసురత్నం, పంచాయతీరాజ్ అధికార్లు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు