పైసల్ కొట్టు ... పింఛన్ పట్టు

14 Jan, 2015 10:32 IST|Sakshi

* రూ.3 వేలిస్తే బోగస్ ఆధార్‌కార్డులు
* చిటికెలో 65 ఏళ్ల వయస్సు ధ్రువీక రణ పత్రం
* మీ-సేవ కేంద్రాలే అడ్డాలు
* ఒక్క సంగారెడ్డిలోనే 1,240 బోగస్ కార్డులు

సంగారెడ్డికి చెందిన షేక్ బాబుమియా వయస్సు 57 సంవత్సరాలు. ఆయనవృద్ధాప్య పింఛన్ పొందాలంటే ఇంకా 8 సంవత్సరాలు నిరీక్షించాలి. కానీ మీ-సేవ అధికారులు రూ.3 వేలు తీసుకుని నిమిషంలోనే బాబుమియా వయస్సును 10 ఏళ్లు పెంచేశారు. బాబుమియా ఒరిజినల్  ఆధార్ కార్డు (నంబర్ 990948450491)లో ఆయన 1957లో జన్మించినట్లు ఉంటే, బోగస్ ఆధార్‌కార్డులో దాన్ని 1947 జనవరి 1గా మార్చేసి పింఛన్‌కు అర్హుణ్ని చేసేశారు. ఈ బోగస్ తతంగాన్నంతా నడిపించింది సంగారెడ్డిలోని ఓ మీ-సేవ కేంద్రం కావడం గమనార్హం. ఇలా బాబుమియా ఒక్కరే కాదు ఒక్క సంగారెడ్డిలోనే 1,240 మంది బోగస్ ఆధార్‌లతో పింఛన్లకు అర్హులయ్యారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా బోగస్ కార్డులతో పింఛన్ పొందుతున్న వారి సంఖ్య ఎంత ఉంటుందో అంచనా వేయవచ్చు. ఇవన్నీ తెలిసినప్పటికీ అధికారులు మాత్రం చూస్తున్నాం...చర్యలు తీసుకుంటున్నాం..అంటూ గడిపేస్తున్నారు. దీంతో సర్కార్ ఖజానాపై భారీగా భారం పడుతోంది.
 
సంగారెడ్డి మున్సిపాలిటీ: ధనం మూలం ఇధం జగత్ అన్నట్లుగానే ఉంది మన సంక్షేమ పథకాల అమలు తీరు. కాసిన్ని పైసలిస్తే చాలు యంత్రాంగం నిబంధనలకు నీళ్లొదులుతుంది. చేయితడపగానే అనర్హులనైనా అర్హులుగా మార్చేసి సర్కార్ సాయాన్ని పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తుంది. రూ.200 నుంచి ఏకంగా రూ.1000కి పెరిగిన పింఛన్‌లలో అమ్యామ్యాల తంతు మరీ శ్రుతిమించిపోయింది. రూ. 3 వేలు సమర్పిస్తే చాలు 50 ఏళ్ల వ్యక్తి కూడా చిటికెలోనే 65 ఏళ్లు దాటిపోయి పింఛన్‌కు అర్హుడైపోతాడు. దర్జాగా ప్రతి నెల రూ.1000 పింఛన్ తీసుకుంటాడు. దీంతో సర్కార్ ఖజానాపై రోజురోజుకూ భారం పెరుగుతుండగా, అక్రమార్కుల జేబులు మాత్రం నిండుతున్నాయి.
 
ఆధార్‌కార్డునూ మార్చేస్తున్నారు
సర్కార్ అమలు చేసే ఏ సంక్షేమ పథకం పొందాలన్నా ఇప్పుడు ఆధార్ తప్పనిసరిగా మారింది. ఆధార్‌కార్డులోని వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటున్న అధికారులు పింఛన్‌లు, ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలను మంజూరు చేస్తున్నారు. దీంతో అక్రమార్కుల కన్ను ఆధార్‌కార్డులపై పడింది. ఆధార్‌కార్డులో వయస్సు తక్కువ ఉంటే వెంటనే దాన్ని మార్చేసి ఇచ్చేస్తున్నారు. ఈ తతంగానికి ఆధార్‌కార్డులు మంజూరు చేసే మీ-సేవ కేంద్రాలే అడ్డాలుగా మారడం ఆందోళన కలిగిస్తున్న అంశం. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ తతంగం కొనసాగుతోంది.
 
నేతల ప్రమేయంతోనే అక్రమాలు
వయసు నిర్ధారించే ధ్రువీకరణ పత్రం ఉంటేనే అధికారులు పింఛన్ మంజూరు చేస్తున్నారు. దీంతో గతంలో ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండా పింఛన్ పొందిన వారి పేర్లు తాజా అర్హుల జాబితాలో గల్లంతయ్యాయి. దీంతో వారంతా తమకు తెలిసిన చోటామోటా నాయకులను ఆశ్రయిస్తున్నారు. జనంముందు  గొప్పలు చెప్పుకునేందుకు సదరు నేతలు వారికి సన్నిహితంగా ఉండే మీ-సేవ కేంద్రాల నిర్వాహకులకు డబ్బులిప్పించి నకిలీ ఆధార్ పత్రాలను ఇప్పిస్తున్నారు. కొత్తగా పొందిన నకిలీ ఆధార్‌కార్డులతో పింఛన్‌లకు దరఖాస్తు చేసుకుంటున్న వారికి అధికారులు పింఛన్‌లు మంజూరు చేస్తున్నారు. ఇలా పింఛన్‌లు పొందిన వారిలో ఒక్క సంగారెడ్డి పట్టణానికి చెందిన వారే 1,240 మంది ఉండడం గమనార్హం. ఇందుకు నిదర్శనంగా నర్సాపూర్ మండల పరిధిలోని రత్నాయపల్లి గ్రామానికి చెందిన 36 మంది బోగస్ ఆధార్‌కార్డులతో పింఛన్‌లు పొందినట్లు డీఆర్‌డీఏ అధికారులు గుర్తించారు. వారికి బోగస్ ఆధార్‌కార్డులిచ్చిన మీ-సేవ కేంద్రం నిర్వాహకుడిపై చర్యలకు సిద్ధమయ్యారు.
 
వికలాంగుల పింఛన్‌కూ నకిలీ సర్టిఫికెట్లే
 ఇక వికలాంగులకు ఇచ్చే పింఛన్ పొందేందుకు కూడా చాలా మంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమానికి ఏకంగా డీఆర్‌డీఏ కార్యాలయమే వేదిక కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కార్యాలయంలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగి, పింఛన్లు మంజూరు చేసే సెక్షన్ అధికారి కలిసి ఈ నకలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కార్యాలయానికి వచ్చే వారిని కిందిస్థాయి ఉద్యోగి మాటల్లో దింపి 55 శాతం వికలత్వం ఉంటేనే పింఛన్ వస్తుందని...అంతకంటే తక్కువ ఉన్నట్టయితే రాదని చెబుతాడని,  55 శాతం కంటే తక్కువ వికలత్వం ఉన్నా వికలాంగుల పింఛన్ ఇప్పిస్తానని, అందుకు రూ.10 వేలు ఖర్చవుతాయని చెబుతాడు. ముందుగా రూ.5 వేలు ఇస్తే చాలని, పింఛన్ మంజురయ్యాకే మిగతా రూ.5 వేలు తీసుకుంటానని చెప్పి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంతో పాటు పింఛన్ మంజూరయ్యేలా చేస్తున్నాడు. ఇలా నకిలీ ధ్రువీకరణ పత్రాల వ్యవహారం డీఆర్‌డీఓ కార్యాలయంలోనే నడుస్తుండడంతో అనర్హులైన వికలాంగులు కూడా కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు.
 
క్రిమినల్ కేసులు తప్పవు
 నకిలీ ఆధార్‌కార్డులతో పింఛన్ పొందుతున్న వారి వివరాలను సేకరిస్తున్నాం. త్వరలోనే వారిపై  క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. జిల్లా వ్యాప్తంగా 300 మంది నకిలీ ఆధార్‌కార్డులతో పింఛన్ పొందినట్లు గుర్తించాం.  ప్రస్తుతం కొత్త పింఛన్ల పంపిణీ కొనసాగుతుండడంతో ఈ అంశంపై దృష్టి సారించలేదు. త్వరలోనే అక్రమార్కులను గుర్తించి చర్యలు చేపడతాం. ఇక వికలాంగుల పింఛన్ కోసం మెడికల్ బోర్డు ఇచ్చే ధ్రువీకరణ పత్రాలనే పరిగణలోకి తీసుకుంటాం. నకిలీ పత్రాలతో వికలాంగుల పింఛన్ పొందుతున్న వారిని గుర్తించి జాబితా నుంచి వారి పేర్లు తొలగిస్తాం. నకిలీ ఆధార్‌కార్డులిచ్చిన మీ-సేవ కేంద్రాలను కూడా సీజ్ చేస్తాం.             
 -సత్యనారాయణ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ

 

మరిన్ని వార్తలు