బిల్లు లొల్లి

5 Aug, 2015 04:08 IST|Sakshi
బిల్లు లొల్లి

‘ఇందిరమ్మ’ ఇళ్లకు డబ్బులు చెల్లించాలని కాంగ్రెస్ ఆందోళనలు
వరంగల్:
ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై జిల్లా దద్దరిల్లింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ కార్యాలయూల ఎదుట నిరసనలు హోరెత్తాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గృహ నిర్మాణ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి చొల్లెటి దామోదర్, డీసీసీబీ  చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ పాల్గొని మాట్లాడారు.

అనంతరం హౌసింగ్ పీడీ లక్ష్మణ్‌కు వినతిపత్రం అందించారు. వారం రోజుల్లో బిల్లులిచ్చే ప్రక్రియ ప్రారంభించకుంటే మళ్లీ నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టంచేశారు. వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నర్సంపేటలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మాజీ వుంత్రి బస్వరాజు సారయ్యు కూడా పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయూలని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. భూపాలపల్లిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులివ్వాలని కోరారు.
 
సీఎం దిష్టిబొమ్మ దహనం
మానుకోటలో కాంగ్రెస్ కార్యాలయం నుంచి ముత్యాలమ్మ చెట్టు వరకు కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ములుగులోని వరంగల్- ఏటూరునాగారం జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఎస్టీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ ఆంగోతు బలరాం. కోఆర్డినేటర్ శంకర్‌నాయక్ తదితరులు రాస్తారోకో చేశారు. హామీలతో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ప్రజలను మోసగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య విమర్శించారు.

ఇందిరమ్మ బిల్లులు త్వరగా చెల్లించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి హెచ్చరించారు. పరకాలలో ధర్నా చేశారు. స్టేషన్‌ఘనపూర్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద మాజీ మంత్రి విజయరామారావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మంత్రి భువనగిరి ఆరోగ్యం, రాజారపు ప్రతాప్ మాట్లాడారు. జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేదని తెలిసింది. జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మపురి శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు చిర్ర సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సుమారు నాలుగు గంటల పాటు ధర్నా కొనసాగించారు.
 
కాంగ్రెస్, బీజేపీ నాయకుల వాగ్వాదం
వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా జనగామలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. స్థానిక బీజేపీ నాయకులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు సర్దిచెప్పారు. పాలకుర్తిలో నియోజకవర్గ ఇన్‌చార్జి దుగ్యాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజీవ్ చౌరస్తా నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డోర్నకల్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి ఎవరూ లేకపోవడంతో ధర్నా సాదాసీదాగా జరిగింది.

మరిన్ని వార్తలు