తబలా వాయిద్యంలో మేటి ‘పాయల్‌’

8 Mar, 2019 09:42 IST|Sakshi

డిచ్‌పల్లి: పాయల్‌ కోటగిర్‌కర్‌ సల్ల. సంగీత ప్రపంచంలో ఈ పేరు వినని వారుండరు. మహిళలు అరుదుగా ఎంచుకునే తబలా వాయిద్యంలో జాతీయ స్థాయి యువ కళాకారిణిగా పాయల్‌ ఎదిగారు. సంగీత నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన పాయల్‌ చిన్ననాటి నుంచే తన బాబాయి కృష్ణ కోటగిర్‌కర్‌ వద్ద తబలా వాయిద్యంలో ఓనమాలు నేర్చుకున్నారు. 2002లో సర్టిఫికెట్‌ కోర్సు పూర్తి చేశారు. 2004లో శ్రీత్యాగరాజ ప్రభుత్వ సంగీత కళాశాల, రాంకోటి, హైదరాబాద్‌ నుంచి డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు ఉస్తార్‌ షబ్బీర్‌ నిస్సార్‌ వద్ద శిష్యరికం చేశారు.

2008 నుంచి 2017 వరకు జ్ఞాన సరస్వతి సంగీత నృత్య పాఠశాల, నిజామాబాద్‌లో ‘హానరోరియం బేసిక్‌’ పద్ధతిన సహాయ అధ్యాపకురాలిగా పనిచేశారు. తబలాతో పాటు హిందుస్తానీ వోకల్‌లోనూ ప్రావీణ్యం సాధించి సర్టిఫికెట్‌ కోర్సు పూర్తి చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సాయినగర్‌లో పుట్టి పెరిగిన పాయల్‌ ఖలీల్‌వాడీలోని మోడరన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పదో తరగతి, నిర్మల హృదయ జూనియర్‌ కాలేజ్‌లో ఇంటర్, అంబేద్కర్‌ ఓపెన్‌యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. కళారంగంలో అంచెలంచెలుగా ఎదిగిన పాయల్‌ దేశ రాజధాని ఢిల్లీ, బెంగుళూరు, కోల్‌కత్తా, చెన్నై, ముంబయి, బళ్లారి, పూణె, హైదరాబాద్‌ నగరాల్లో తబలా వాయిద్య ప్రదర్శనలిచ్చారు. ఇప్పటి వరకు పట్టణాలు, నగరాలతో పాటు టెలివిజన్, రేడియోల్లో కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు. వందల మంది శిష్యులకు తబలా వాయిద్యంలో శిక్షణ నిచ్చారు.  

ప్రముఖ మృదంగ విద్యాంసుడు యెల్లా వెంకటేశ్వరరావు, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి, గాయని ఎస్పీ శైలజ వంటి ప్రముఖుల నుంచి పాయల్‌ ప్రశంసలందుకున్నారు. 2008లో నేషనల్‌ గోల్డ్‌ మెడల్, రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో నాలుగు సార్లు అవార్డులు, జిల్లా స్థాయిలో వందల సంఖ్యలో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ‘ఇందూరు అపురూప’ అవార్డుతో పాటు నిజామాబాద్‌ రోటరీ క్లబ్‌ ద్వారా ‘డాటర్‌ ఆఫ్‌ నిజామాబాద్‌’, ‘మార్తాంగిక శిరోమణి’వంటి అవార్డులు అందుకున్నారు. తనదైన కళా ప్రదర్శనలతో తబలా వాయిద్య కళా ప్రియుల మనసు దోచుకున్న ఆమె కళారంగంలోనే కాకుండా రాజకీయంలో రాణించారు.

మెట్టినిల్లు డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ గ్రామ ఎంపీటీసీ సభ్యురాలి(2014)గా ప్రజలకు సేవలిందించారు. 2017లో రాష్ట్ర ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి ‘తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ప్రముఖ తబలా కళాకారిణి’ అవార్డు, లక్ష రూపాయల నగదుతో సత్కరించింది.2018లో టీఎస్‌పీఎస్‌సీ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో సంగీతం, తబలా ఉపాధ్యాయురాలిగా ఎంపికైంది. దీంతో ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి సంగీత ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరారు.

ప్రస్తుతం జూలై 30, 2018 నుంచి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల, ఆర్మూర్‌లో తబలా, సంగీత ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.  కళాకారిణిగా రాణించడంలో తల్లిదండ్రులు గంగాధర్, జయశ్రీ, కుటుంబసభ్యులు, భర్త హిరికృష్ణ శర్మ ప్రోత్సాహం ఎంతో ఉందని పాయల్‌ పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను గుర్తించి తగిన విధంగా ప్రోత్సహించడం ఆనందంగా ఉందని మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పాయల్‌ సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు