కార్మికుల వేతనాల చెల్లింపును పర్యవేక్షిస్తాం

8 Sep, 2015 02:49 IST|Sakshi
కార్మికుల వేతనాల చెల్లింపును పర్యవేక్షిస్తాం

స్పష్టం చేసిన హైకోర్టు విచారణ 28కి వాయిదా
 
హైదరాబాద్: రాష్ట్రంలోని పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు చెల్లించే వ్యవహారాన్ని తాము స్వయంగా పర్యవేక్షిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. వేతనాల చెల్లింపునకు ఓ కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినందున, ఆ ప్రక్రియను పదిరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. అన్ని అంశాలను పరిశీలించి ఓ నివేదికను తమ ముందుంచాలని కమిటీకి హైకోర్టు స్పష్టం చేసింది. కనీస వేతనాల చెల్లింపు కోసం దాఖలైన వ్యాజ్యాన్ని కమిటీకి పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త, ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్ మాజీ సభ్యుడు రాజారపు ప్రతాప్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, పంచాయతీల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాల చెల్లింపు వ్యవహారంలో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, కార్మికులకు కనీస వేతనాలు అందనప్పుడు, వాటిని అందించాల్సిన బాధ్యత ఎవరిదని ప్రశ్నించింది. సంబంధిత పంచాయతీలదేనని, నిధులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత వారిదేనని రామచంద్రరావు తెలిపారు. ‘కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. వారు వారి తప్పును తెలుసుకున్నట్లున్నారు. కమిటీ ఏర్పాటు చేయనివ్వండి. ఈ మొత్తం వ్యవహారాన్ని మేమే పర్యవేక్షిస్తాం.’ అని ధర్మాసనం స్పష్టం చేస్తూ, 10 రోజుల్లో కమిటీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు