చెల్లింపులన్నీ ఈ–కుబేర్‌ ద్వారానే..

3 Mar, 2019 11:28 IST|Sakshi

ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు

ఇకపై డీడీ ఖాతాలకు..ఉపకార వేతనాలు

జీపీ బిల్లుల చెల్లింపులూ ఇదే పద్ధతిలో.. 

హన్మకొండ అర్బన్‌: డిజిటల్‌ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రతి నెలా చెల్లింపులు జరిపే ఉద్యోగుల వేతనాలకు సంబంధించి బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా   ట్రెజరీ, ఆర్‌బీఐ ప్రతిష్టాత్మకంగా ఈ–కుబేర్‌ద్వారా చెల్లింపులు చేయనుంది. ఈ విధానం ద్వారా సత్వర చెల్లింపులు జరగడంతో పాటు ప్రభుత్వానికి భారీగా డబ్బులు ఆదా అవుతున్నాయి. దీంతో వేతనాలే కాకుండా ఇకపై ప్రభుత్వ పరంగా చేసే చెల్లింపులన్నీ ఈ–కుబేర్‌ విధానం ద్వారానే చేయాలని నిర్ణయించారు. దీని వల్ల ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే సంబంధిత లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి.

 మార్చి నుంచి మొదలు..
వేతనాలకు సంబంధించి ఆగస్టు నుంచి మొదలు పెట్టిన ప్రభుత్వం ప్రస్తుత మార్చి నుంచి గ్రామ పంచాయతీ బిల్లులు, మునిసిపాలిటీ, సీపీవో, జెడ్పీ, అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీ, జిల్లా గ్రంథా లయ   సంస్థలు,  కేయూ, కాళోజీ నారాయణరా వు హెల్త్‌ యూనివర్సిటీ, జూనియర్, డిగ్రీ కాలేజ్‌ నిధులు, ఇకపై ఈ కుబేర్‌ విధానం ద్వారా చెల్లిం పులు చేయనున్నారు. ప్రసుత్తం ఫిబ్రవరి 28 వర కు ఉన్న చెక్కులు సంబంధిత బ్యాంకుల ద్వారానే చెల్లిస్తారు. మార్చి ఒకటి నుంచి ఈ–కుబేర్‌ ద్వారా ట్రెజరీ అధికారులు పనులు చేపడతారు.

 ఎలాగంటే..
గతంలో ట్రెజరీలో పాస్‌ అయిన చెక్కులు బ్యాంకులకు ఎస్‌బీఐకి పంపేవారు. ఇకపై అలా కాకుండా ఖజానా నుంచి నేరుగా ఆర్‌బీఐ సర్వర్‌కి అప్‌లోడ్‌ చేస్తారు. దీని వల్ల డ్రాయింగ్‌ అధికారులు బ్యాంకుల చుట్టూ తిరిగే పనిలేదు. లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎల్‌ఓసీ)కూడా బ్యాకులకు పంపాల్సిన అవసరం లేదు. పర్సనల్‌ డిపాజిట్స్‌ ఉన్నా డీడీఓలు నేరుగా సాధారణ, ఎల్‌ఓసీ చెక్కులు తీసుకు రావాల్సి ఉంటుంది. డబ్బులు కూడా ఎన్‌ఈఎఫ్‌టీ పద్ధతిలో రెండు గంటల్లోపు చెల్లింపులు చేస్తారు.

ఇవి పాత లెక్కనే..
గతంలో మాదిరిగా  కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, భూసేకరణ, రైతుబంధు చెల్లింపులు ఈ–కుబేర్‌ విధానం ద్వారా కాకుండా బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేస్తారు. ఈ–కుబేర్‌ చెల్లింపుల విషయంలో సంబంధిత డ్రాయింగ్‌ అధికారులు సందేహాలుంటే జిల్లా ఖజానా అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు