పార్టీ ఫిరాయింపుల వెనక తాయిలాలు

23 May, 2019 02:43 IST|Sakshi

లోక్‌పాల్‌కు పీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్‌ ఫిర్యాదు

సాక్షి, న్యూఢిల్లీ: విపక్ష ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించినందుకు గాను వారికి ప్రభుత్వం నుంచి తాయిలాలు అందాయని, ఈ వ్యవహారంపై విచార ణ జరిపించాలని కోరుతూ లోక్‌పాల్‌కు పీసీసీ ప్రధా న కార్యదర్శి కె.మానవతారాయ్‌ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌ కుమార్, సండ్ర వెంకట వీరయ్యలకు ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించి ఇచ్చారని, అలాగే ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డికి కాంట్రాక్టు బిల్లుల తక్షణ చెల్లింపు, భవిష్యత్‌లో కాంట్రాక్టుల కేటాయింపు హామీలివ్వడం ద్వారా అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఫిర్యా దులో పేర్కొన్నారు.ఖమ్మం అర్బన్‌ మండలంలో 10,489 చదరపు గజాలను పువ్వాడ అజయ్‌కుమార్‌కు చెందిన ప్రైవేటు మెడికల్‌ కాలేజీకి కేటాయించారన్నారు. తొలుత క్రమబద్ధీకరణ దరఖాస్తును తిరస్కరించిన రెవెన్యూ శాఖ.. అజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ నుంచి 2016 ఏప్రిల్‌లో టీఆర్‌ఎస్‌లోకి చేరిన తర్వాత ఆ దరఖాస్తును పరిష్కరించారని నివేదించారు.

ఈ స్థలం రూ.50 కోట్ల విలు వ చేస్తుందని, కానీ టీఆర్‌ఎస్‌లో చేరినందుకు కృత జ్ఞతగా నామమాత్రపు రుసుముతో క్రమబద్ధీకరించారని తెలిపారు. అలాగే సండ్ర వెంకట వీరయ్య బుర్హాన్‌పురం రెవెన్యూ గ్రామంలో 1,000 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించారని, టీఆర్‌ఎస్‌లో చేరినందుకు రూ.5 కోట్ల విలువైన స్థలాన్ని రూ.50 లక్షల రుసుముతో క్రమబద్ధీకరించారన్నారు. కందాల ఉపేందర్‌రెడ్డి తనకు రావాల్సిన ప్రభుత్వ కాంట్రాక్టు పనుల పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం తక్షణం చెల్లించడం, భవిష్యత్‌లో కొత్త కాంట్రాక్ట్‌లను కట్టబెట్టడం ద్వారా ప్రయోజనం కల్పించడమనే షరతులతో పార్టీ ఫిరాయించారని నివేదించారు. ఈ వ్యవహారాలపై విచారణకు ఆదేశించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. సదరు ఎమ్మెల్యేలను, తెలంగాణ ప్రభుత్వాన్ని, ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ప్రతివాదులుగా చేర్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా