వైట్‌కాలర్‌ నేరస్తురాలిపై పీడీ యాక్ట్‌

13 Oct, 2017 03:50 IST|Sakshi

తెలంగాణలో తొలిసారి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో తొలిసారిగా వైట్‌కాలర్, ఆర్థిక నేరాలకు పాల్పడిన ఓ మహిళపై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. వైట్‌కాలర్, ఆర్థిక నేరాలతో బాధితులు భారీగా నష్టపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని చట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టం చేసిన తర్వాత తొలిసారిగా సిద్ధిపేట జిల్లాకు చెందిన జొన్నగారి అరుణా రెడ్డిపై రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. 2009 నుంచి పలువురు వ్యక్తులను మోసం చేసిన అరుణా రెడ్డిపై రాచకొండ, హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌తో పాటు నల్లగొండ జిల్లాలో దాదాపు పది చీటింగ్‌ కేసులు ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం... అరుణా రెడ్డి భర్త మధుసూదన్‌ రెడ్డి మెదక్‌ జిల్లా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. మదుసూధన్‌ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అరుణా రెడ్డికి అదే ఫ్యాక్టరీలో అటెండర్‌గా ఉద్యోగం వచ్చింది. తన తండ్రి భూమి పత్రాలు గ్యారంటీగా పెట్టి యూకో బ్యాంక్‌ నుంచి 2003లో రూ.40 లక్షల రుణం తీసుకుంది. ఈఎంఐలు చెల్లించకపోవడంతో.. యూకో బ్యాంక్‌ మేనేజర్‌ భూ పత్రాలను పరిశీలించారు. అరుణారెడ్డి, ఆమె సోదరి నకిలీ భూపత్రాలు సమర్పించి బ్యాంక్‌ను మోసం చేశారని సీబీఐకి మేనేజర్‌ ఫిర్యాదు చేయడంతో అధికారులు వారిని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. దీంతో అరుణారెడ్డి ఉద్యోగాన్ని కోల్పోయింది.

2007లో నగరానికి చెందిన గోపీ, సయ్యద్‌ అంజద్, కరుణాకర్‌తో కలసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేపట్టింది. బంగారు ఆభరణాలు ధరించి ఖరీదైన కార్లలో తిరుగుతూ రియల్టర్‌గా పరిచయం చేసుకొని ఎంతో మందికి కుచ్చుటోపీ పెట్టింది. అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు ఉన్నాయంటూ తక్కువ ధరకే ఇస్తానంటూ పలువురి నుంచి లక్షల్లో వసూలు చేసింది. జ్యువెల్లరీ వ్యాపారులతో పరిచయం ఉందని, తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ భారీగా డబ్బు వసూలు చేసేది. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన వారిని బెదిరించేది. ట్రావెల్స్‌ నుంచి అద్దెకు వాహనాలు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఛీటింగ్‌ కేసు నమోదైంది. దీంతో పాటు పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే నాలుగు కేసుల్లో విచారణ జరుగుతోంది. గత ఆరునెలల్లో ఆరు కేసులు నమోదు కావడంతో మల్కాజ్‌గిరి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అరుణారెడ్డిపై సీపీ మహేశ్‌ భగవత్‌ పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. నిందితురాలిని చంచల్‌గూడలోని స్పెషల్‌ ప్రొవిజన్‌ ఫర్‌ ఉమెన్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు