తినడానికి పనికిరాని పీడీఎస్‌ బియ్యం కిలో రూ.15

16 Sep, 2019 11:39 IST|Sakshi

పీడీఎస్‌ బియ్యానికి ఇటీవల వేలం

ఉపయోగకరమైనవి రూ.17 ధర పలికిన వైనం

ప్రభుత్వానికి అదనంగా రూ.46లక్షల ఆదాయం

2017లో కిలో రూ.6కే పాడిన వ్యాపారులు

గిట్టుబాటు కాదని అప్పట్లో వేలం వాయిదా వేసిన అధికారులు

వేలంలో జేసీ చంద్రశేఖర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో చేకూరిన లాభం

సాక్షి, నల్లగొండ: పదేళ్ల నుంచి సీజ్‌ చేసిన పీడీఎస్‌ బియ్యానికి ఇటీవల నిర్వహించిన వేలంలో మంచి ధర లభించింది. తినడానికి పనికిరాని బియ్యం కిలోకు రూ.15 పలకగా.. మంచిగా ఉన్న బియ్యానికి రూ.17 ధర వచ్చింది. సీజ్‌ చేసిన బియ్యాన్ని వేలం వేయాలని రెండేళ్ల క్రితమే ఆదేశాలు వచ్చినా.. అప్పట్లో కిలోకు రూ.6 పలకడంతో వేలం పాట వాయిదా వేశారు. అయితే ఇటీవల జేసీ చంద్రశేఖర్‌ చాకచక్యంగా వ్యవహరించి తానే స్వయంగా వేలం పాట ప్రారంభించి మంచి ధర వచ్చేలా చూశారు. దీంతో ప్రభుత్వానికి అదనంగా రూ.46 లక్షల ఆదాయం సమకూరినట్లయ్యింది. 

అక్రమమార్గంలో తరలుతూ అధికారులకు పట్టుబడిన రేషన్‌ బియ్యానికి (పీడీఎస్‌ బియ్యానికి) ఇటీవల నిర్వహించిన వేలం గిట్టుబాటైంది. దాదాపు పదేళ్ల నుంచి సీజ్‌ చేసిన పీడీఎస్‌ బియ్యాన్ని రెండేళ్ల క్రితమే వేలం వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ అప్పట్లో ధర గిట్టుబాటు కాక వేలం వాయిదా చేశారు. కానీ.. వారం రోజుల క్రితం అదే బియ్యానికి వేలం నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ చాకచక్యంగా వ్యవహరించి తానే స్వయంగా పాటను మొదలు పెట్టి వేలం ప్రారంభించారు. దీంతో రెండేళ్ల క్రితం ధరకంటే అధిక రేటు పలికాయి. దీంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం చేకూరినట్టు అయ్యింది.

2017లోనే వేలం వేయాలని ఆదేశాలు..
ప్రజలకు అందాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పడుతుండగా ఇటు విజిలెన్స్, సివిల్‌సప్లయ్‌ అధికారులు.. అటు పోలీసులు పట్టుకున్నారు. జిల్లా యంత్రాంగం ఇటీవలే వేలం వేసింది. గత పది సంవత్సరాల నుంచి జిల్లాలో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడడంతో ఆ బియాన్ని అధికారులు సీజ్‌ చేస్తూ వచ్చారు. అయితే వాటిని వేలం వేసే విషయంలో మాత్రం ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో పౌర సరఫరాల శాఖ దాన్ని పట్టించుకోలేదు. 2017 సంవత్సరంలో వేలం వేయాలని ఆదేశాలు రావడంతో అప్పట్లో అధికారులు సీజ్‌ చేసిన బియ్యానికి వేలం పాట పెట్టగా తినడానికి ఉపయోగపడే, ఉపయోగపడని బియ్యానికి సంబంధించి వ్యాపారులు రెండు రకాల బియ్యానికి కూడా కిలో ఒక్కంటికీ 6రూపాయలే పాట   
పాడారు. దీంతో గిట్టుబాటు కాదని భావించిన అధికారులు అప్పట్లో బియ్యం వేలాన్ని వాయిదా వేశారు. 

ఇటీవల బియ్యాన్ని వేలం వేసిన జేసీ
పదేళ్ల నుంచి పట్టుబడిన రేషన్‌ బియ్యాన్ని ఇటీవల జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌ వేలంపాట నిర్వహించారు. గతంలో నిర్వహించిన వేలానికి భిన్నంగా పాటను వ్యాపారుల నుంచి మొదలు కాకుండా తానే ధర నిర్ణయించి వేలం పాటను ప్రారంభించారు. అయి తే మొత్తం తినడానికి ఉపయోగపడని అన్‌ఫిట్‌ బియ్యం 3011.95 క్వింటాళ్లు ఉండగా అందులో డీఎం పరిధిలో 198 క్వింటాళ్లు ఉన్నాయి. తినడానికి అనుకూలమైనటువంటి బియ్యం 2813.95 క్వింటాళ్లు ఉన్నాయి. అయితే తినడానికి పనికిరాని బియ్యాన్ని మొదట ఒక కిలోకు రూ.8 చొప్పున పాట ప్రారంభించగా వేలంలో పాల్గొన్న వ్యాపారులు చివరికి కిలో రూ.15 చొప్పున పాట పాడి తీసుకున్నారు. అయితే తినడానికి అనుకూలమైన బియ్యానికి సంబంధించి పాటను రూ.10 నుంచి మొదలుపెట్టగా పాటలో పాలొన్న వ్యాపారులు ఫైనల్‌ ధర రూ.17కు దక్కించుకున్నారు. ఇలా తినడానికి పనికిరాని బియ్యానికి రూ.32,28,164, తినడానికి ఉపయోగకరమైన బియ్యానికి రూ.42,20925 వచ్చాయి. రెండూ కలిపి రూ.74,49,089 ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఇదే బియ్యాన్ని 2017లో రూ.6 ధరకే అమ్మి ఉంటే కేవలం రూ.28లక్షలు మాత్రమే వచ్చేవి. ప్రస్తుతం జేసీ చాకచక్యంగా వ్యవహరించి వేలం పాడడంతో అదనంగా రూ.46లక్షల ఆదాయం వచ్చినట్లయ్యింది.

రేషన్‌బియ్యం బ్లాక్‌ ఇలా..
గతంలో అర్హులతో పాటు చాలామంది అనర్హులకు తెల్లరేషన్‌ కార్డులు ఉండేవి. అప్పటి ప్రభుత్వం అమలు చేసిన ఆరోగ్య శ్రీ పథకం, స్కాలర్‌షిప్‌ కోసం అడ్డదారిన చాలా మంది అనర్హులు కార్డులు పొందారు. వీరిలో కొందరు రేషన్‌ తీసుకుని బ్లాక్‌లో ఎక్కువ ధరకు విక్రయించేవారు. మరికొందరు రేషన్‌ షాపుల్లోనే వదిలేసేవారు. అప్పట్లో రేషన్‌షాపుల్లో బయోమెట్రిక్‌ విధానం లేదు. దాంతో డీలర్లకు ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవహరించేవారు. కార్డుదారులు బియ్యం తీసుకోకపోవడంతో డీలర్లకు కాసుల వర్షం కురిసేది. ప్రతినెలా క్వింటాళ్ల కొద్దీ బియ్యం మిగిలేవి. వాటన్నింటినీ వ్యాపారులకు అమ్ముకుని సొమ్ము చేసుకునేవారు. వాటిని తీసుకెళ్లే క్రమంలో ఇటు డీలర్లు, అటు బ్లాక్‌ దందా చేసే వారిపై దాడులు చేసిన సందర్భంలో బియ్యం పట్టుబడడంతో వాటికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో సీజ్‌ చేసేవారు. కొన్ని సందర్భంలో అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని నిల్వ చేసినప్పుడు దాడులు చేసి పట్టుకున్న ఘటనలూ ఉన్నాయి. పదేళ్ల నుంచి జరుగుతున్న ఇలాంటి సంఘటనల్లో లభ్యమైన బియ్యాన్ని ఆయా ఏరియాల్లోని ఎంఎల్‌ఎస్‌ గోదాముల్లో నిల్వ చేస్తూ వస్తున్నారు. దీంతో మొత్తం 5,900 క్వింటాళ్ల వరకు సీజ్‌ చేసిన బియ్యం నిల్వలు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు