నిజాలను వక్రీకరిస్తే ‘జార్జిరెడ్డి’ను అడ్డుకుంటాం

19 Nov, 2019 10:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పీడీఎస్‌యూ నిర్మాత జార్జిరెడ్డిపై నిర్మించిన సినిమాలో నిజాలను వక్రీకరిస్తే... ‘జార్జిరెడ్డి’ మూవీని అడ్డుకుంటామని పీడీఎస్‌యూ జాతీయ అధ్యక్షుడు ఎం.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.పరశురాం హెచ్చరించారు. సినిమా జార్జిరెడ్డి ఆశయాలు, లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉంటే సహించబోమన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ... కామ్రేడ్‌ జార్జిరెడ్డి తన ఆశయాలు, సిద్ధాంతాల కోసం నిలబడి, కలబడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

విద్యార్థి లోకానికి మరో చేగువేరా అన్నారు. ఆయన ప్రగతిశీల విద్యార్థులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉస్మానియా క్యాంపస్‌లో జరిగిన అరాచకాలను అడ్డుకున్నాడన్నారు. మతోన్మాదాన్ని, కులోన్మాదాన్ని ఎదిరించాడన్నారు. అంతేకాకుండా ఆయన అణు భౌతికశాస్త్రంలో గోల్డ్‌మెడల్‌ సాధించాడని గుర్తుచేశారు. చదువుతో పాటు సమాజాన్ని అధ్యయనం చేసిన గొప్ప మేధావి అని కొనియాడారు. అలాంటి జార్జిరెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనలను వ్యాపార దృక్పథంతో సినిమాగా రూపొందించడం సరికాదన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయకన్న తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా