ప్రశాంతంగా  మూడో విడత 

31 Jan, 2019 10:32 IST|Sakshi
ఓటు వేయడానికి ఎదురు చూస్నున్న మహిళలు

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: గ్రామ పంచాయతీ చివరి విడత పోలింగ్‌ జిల్లాలో ప్రశాంతంగా ము గిసింది. నిజామాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధి ఎనిమిది మండలాల్లోని 148 గ్రామ పంచాయతీల సర్పంచ్‌ స్థానాలకు, 1,098 వార్డు సభ్యుల స్థానాలకు బుధవారం పోలింగ్‌ జరిగింది. మొత్తం 211 పంచాయతీలకు గాను, 61 జీపీలు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. ఇందల్వాయి మండలంలోని రెండు జీపీలు తిర్మన్‌పల్లి, గంగారాంతండాలో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించి నామినేషన్లు వేయనందున ఎన్నికలు జరుగలేదు.

మిగిలిన 148 పంచాయతీలకు పోలింగ్‌ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించిన ఎన్నికల అధికార యంత్రాంగం, భోజ న విరామం అనంతరం కౌంటింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. వార్డు సభ్యుల ఫలితాలను ప్రకటించిన తర్వాత, సర్పంచ్‌ ఓట్ల లెక్కింపు చేపట్టా రు. అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. పోలింగ్‌ ప్రారంభమైన ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు.

అత్యధికంగా 87 శాతం ఓట్లేసిన మహిళలు.. 
నిజామాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో మొత్తం 2.16 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1.73 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా మహిళలు 1,00,847 (87 శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకోగా, 72,262 (71శాతం) మంది పురుషులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషు ల కంటే మహిళలే ఉత్సాహం గా ఓటింగ్‌లో పాల్గొనడం గమనార్హం. ఉదయం 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 35.40 శాతం పోలింగ్‌ జరిగింది. 11 గంటల వ రకు ఈ పోలింగ్‌ శాతం 59.69 శాతానికి పెరిగింది. పోలింగ్‌ ముగిసే సమయం మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొత్తం 79.81 శాతం పోలింగ్‌ నమోదైందని అధికార యంత్రాంగం ప్రకటించింది.

పకడ్బందీ ఏర్పాట్లు.. 
పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్‌ ఎం రామ్మోహన్‌ రావు ఆదేశాల మేరకు ఓటేసేందుకు వచ్చిన వికలాంగులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీల్‌చైర్లు ఏర్పాటు చేశారు. తాగు నీ టి వసతి కూడా కల్పించారు. మరోవైపు కౌంటింగ్‌ ప్రక్రియ కూడా సజావుగా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఓటుహక్కు వినియోగించుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. 
నవీపేట్‌ మండలం పోతంగల్‌ గ్రామంలో నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. సిరికొండ మండలం రావుట్లలో నిజామాబాద్‌రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కుమారుడు జగన్, కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు.

జల్లాపల్లికి పోలింగ్‌.. 
పోలింగ్‌ నిలిచిపోయిన కోటగిరి మండలం జల్లాపల్లి గ్రామానికి బుధవారం పోలింగ్‌ నిర్వహించారు. రెండో విడతలో జరగాల్సి ఉండగా, బ్యాలెట్‌ పేపర్‌లో జరిగిన పొరపాటు కారణంగా పోలింగ్‌ నిలిపివేవారు. ఓటరు జాబితా నుంచి తమ ఓట్లు గల్లంతయ్యాయని ఇందల్వాయి మండలం గన్నారంలో కొందరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అక్కడే ఉన్న పోలీస్‌ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మాక్లూర్‌ మండలం కేంద్రంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం చేసిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ పరిశీలన.. 
జిల్లాలో పోలింగ్‌ సరళిని కలెక్టర్‌ ఎంఆర్‌ఎం రావు కలెక్టరేట్‌లో వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. సమస్యాత్మక ఎనిమిది పంచాయతీల పరి«ధిలోని 25 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ వెబ్‌క్యాస్టింగ్‌ ప్రక్రియను నిర్వహించారు.    

మరిన్ని వార్తలు