ముగిసిన పంచాయతీ ఎన్నికలు

31 Jan, 2019 10:53 IST|Sakshi
ఓటు వేసేందుకు వాగుదాటి వస్తున్న మంగళి తండా గ్రామస్తులు  

సాక్షి, వరంగల్‌ రూరల్‌: నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటైన తర్వాత , స్వరాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటింగ్‌ నమోదైంది. 89.78శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడో విడతలో చెన్నారావుపేట, నెక్కొండ, ఆత్మకూర్, దామెర, గీసుకొండ మండలాల్లోని 120 గ్రామ పంచాయతీలు, 1070 వార్డు స్థానాలకు ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ జారీ చేయగా 29 గ్రామాల్లో సర్పంచ్‌లు, 310 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన 91 గ్రామాలు, 760 వార్డు స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన తమ ఓటును వినియోగించుకున్నారు. దామెర మండలంలో పలు పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ హరిత పరిశీలించారు.

జిల్లాలో 91.23శాతం ఓటింగ్‌..
మూడో విడతలోని చెన్నారావుపేట, నెక్కొండ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ మండలాల్లో భారీగా ఓటింగ్‌ శాతం నమోదయింది. ఐదు మండలాల్లో 1,16,846 మంది ఓటర్లు ఉండగా 1,04910 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 57,898 మంది పురుష ఓటర్లుండగా 51,978, 58,939 మంది మహిళా ఓటర్లుండగా 52,932 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదు మండలాల్లో  89.78శాతం ఓటింగ్‌ శాతం నమోదు కాగా అత్యధికంగా ఆత్మకూర్‌లో 92.28శాతం ఓటింగ్‌ నమోదు కాగా  నెక్కొండలో తక్కువగా 88.02శాతం ఓటింగ్‌ నమోదయింది.

మధ్యాహ్నం ఎన్నిక కౌంటింగ్‌

ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఎన్నికలు జరిగాయి. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్‌ను ప్రారంభించారు. రాత్రి వరకు కౌంటింగ్‌ను నిర్వహించి ఆయా గ్రామ పంచాయతీల వారిగా ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు.

మరిన్ని వార్తలు