ఈసారైనా న్యాయం జరిగేనా?

8 Jan, 2015 03:38 IST|Sakshi
ఈసారైనా న్యాయం జరిగేనా?

మంచిర్యాల టౌన్ : పారిశ్రామికంగా, ఆర్థికంగా తూర్పు జిల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నా రైల్వే బడ్జెట్‌లో మాత్రం ప్రతీసారి అన్యాయం జరుగుతోంది. జిల్లా తూర్పులో మంచిర్యాల రైల్వేస్టేషన్ తలమానికంగా ఉన్నా సమస్యలు మాత్రం వెక్కిరిస్తున్నాయి. ఈసారి బడ్జెట్‌లో జిల్లాకు న్యాయం చేయాలని ఎంపీలు ప్రతిపాదనలు రూపొందించారు. బుధవారం హైదరాబాద్‌లో రైల్వే జీఎం శ్రీవాస్తవతో తెలంగాణ ఎంపీలు ప్రత్యేకంగా సమావేశం కాగా వారివారి ప్రతిపాదనలు జీఎం ముందుంచారు.

2015-16 రైల్వే సాధారణ బడ్జెట్‌లోనైనా తూర్పు ప్రాంతానికి, రైల్వే ప్రయాణికులకు ఊరట కలిగించే అవకాశాలు ఏమైనా ఉంటాయా అన్న సందిగ్ధం నెలకొంది. ఈక్రమంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ రైల్వే జీఎం దృష్టికి పలు ప్రతిపాదనలు తీసుకువెళ్లారు. ఈ రైల్వే బడ్జెట్‌లో తూర్పునకు ఏ మేర ప్రాధాన్యత లభిస్తుందో చూడాలి. రైల్వే జీఎం శ్రీవాస్తవను పెద్దపల్లి నుంచి బెల్లంపల్లి వరకు రైల్లో ప్రయాణించాలని ఎంపీ సుమన్ ఆహ్వానించడంతో ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు