అలజడి రేపిన వింత ఘటన

5 Jun, 2017 15:44 IST|Sakshi
అలజడి రేపిన వింత ఘటన

పెంబర్తి: మానసికరోగి మాటలు నమ్మి స్థానికులు జాతీయ రహదారిని తవ్వేసిన వింత ఘటన జనగామ జిల్లా పెంబర్తిలో చోటుచేసుకుంది. వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై కొంతమంది జేసీబీతో పెద్దగొయ్యి తవ్వారు. దీనిపై ఆరా తీసిన పోలీసులకు అవాక్కయ్యే నిజం తెలిసింది. ఇక్కడ శివలింగం ఉందని మనోజ్‌ అనే వ్యక్తి చెప్పడంతో గొయ్యి తవ్వినట్టు స్థానికులు తెలిపారు.

తనకు శివుడు కలలో కనిపించి ఇక్కడ తవ్వమన్నాడని మనోజ్‌ చెప్పడం గమనార్హం. శివుడు తనను పూనినట్టుగా వింతగా ప్రవర్తిస్తుడటంతో స్థానికులు అతడి మాటలు నమ్మారు. తాను చెప్పినట్టు చేయకపోతే శివుడు శపిస్తాడని అతడు భయపెట్టాడు. దీంతో స్థానికులు జేసీబీ సహాయంతో 10 అడుగుల గుంతను తవ్వారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మనోజ్‌తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

తాము గొయ్యి తవ్విన చోట కచ్చితంగా శివలింగం ఉందని మనోజ్‌ అంటున్నాడు. శివరాత్రి రోజునే ఇక్కడ తవ్వాలనుకున్నా కుదర్లేదని చెప్పాడు. గొయ్యి తవ్వడానికి స్థానిక రాజకీయ నేతలు సహకరించారని వెల్లడించారు. అయితే పిచ్చోడి మాటలు నమ్మి రోడ్డు తవ్వారని ప్రగతిశీలవాదులు అంటున్నారు.