రెక్కలు తొడిగేనా.. రివ్వున ఎగిరేనా?

18 Jan, 2019 01:05 IST|Sakshi

పెండింగ్‌లో ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెం ఎయిర్‌పోర్టులు

ఉడాన్‌ పథకంతోనైనా మోక్షం లభించేనా?

విజన్‌ 2040 నివేదికతో  మళ్లీ తెరపైకి డిమాండ్‌

2040 నాటికి 100 కోట్లు దాటనున్న విమాన ప్రయాణికులు

15 ఏళ్లలో 100 విమానాశ్రయాలు అవసరమని కేంద్రం అంచనా

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త విమానాశ్రయాల డిమాండ్‌  మళ్లీ తెరపైకి వచ్చింది. పౌర విమానయాన శాఖ విజన్‌– 2040 తాజా నివేదిక ప్రకారం.. 2040 నాటికి దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య 100 కోట్లు దాటుతుంది. ఇందుకు తగ్గట్లుగా రాబోయే 15 ఏళ్లలో దాదాపు 100 విమానాశ్రయాలను ఏర్పాటు చేసుకోవాలి. దీంతో తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు అంశంపై చర్చ ఊపందు కుంది. రాష్ట్రంలో చాలాకాలంగా వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, నిజామాబాద్‌లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉంది.

మూడేళ్ల క్రితం  ప్రయత్నాలు...
2015లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విమానాశ్రయాల డిమాండ్‌ను పరిశీలించింది. అయితే, అప్పటికే తెలంగాణలో ఉన్న శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం.. 150 కి.మీ.ల పరిధిలో కొత్తగా ఎలాంటి ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయ కూడదు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఏవియేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్‌ అకాడమీ ఓ అధ్య యనం చేసింది. కొత్త ఎయిర్‌పోర్టుల సాధ్యాసాధ్యా లపై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ అధ్యయనం చేసి గతంలో మూసివేసిన రామగుండం, వరంగల్‌ ఎయిర్‌పోర్టులను పునరుద్ధరించవచ్చని చెప్పింది. వీటితోపాటు నిజామాబాద్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం(కొత్తగూడెం) ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయవచ్చని సూచించినట్లు సమాచారం. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను పౌర విమానయాన శాఖ ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది.

వరంగల్‌కే  అధిక  అవకాశాలు
నిజాం హయాంలో వరంగల్‌ సమీపంలోని మామునూరులో భారీ విమానాశ్రయం ఉండేది. దీన్ని కాగజ్‌నగర్‌లోని పేపర్‌మిల్‌ అవస రాలు తీర్చేందుకు 1930లో హైదరాబాద్‌ ఏడో నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ హయాంలో నిర్మించారు. అప్పట్లో హైదరాబాద్‌ రాష్ట్రంలో ఇదే అతిపెద్ద విమానాశ్రయమని ప్రతీతి. ఇండో– చైనా యుద్ధంలో ఢిల్లీ విమానాశ్రయాన్ని శత్రువులు లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఈ విమానాశ్రయం సేవలందించింది. 1981 దాకా ఇది సేవలందించింది. ఇది 1875 ఎకరాల భూమి, 2 కి.మీ. రన్‌వే కలిగి ఉండటం గమనార్హం. ప్రస్తుతం అది మూసివేసి ఉంది. అది ఇప్పటికీ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) పరిధిలోనే ఉంది. ఈ లెక్కన ఇప్పటికే మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉండటం, గతంలో సేవలందించి ఉండడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ విమానాశ్రయ పునరుద్ధరణకే అధిక అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు

ఉడాన్‌  పథకంతోనైనా  మోక్షం వచ్చేనా?
ఇప్పటికే తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఆదిలా బాద్‌లో విమానాశ్రయాల ఏర్పాటు అంశం కేంద్రం పరిశీల నలో ఉంది. పైగా ఉడాన్‌ రీజియన్‌ కనెక్టివిటీ స్కీమ్‌లో భాగంగా కేంద్రం ఎయిర్‌ కనెక్టివిటీని పెంచేం దుకు ప్రయ త్నిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రయత్నాలు ఫలించి కేంద్రం పచ్చ జెండా ఊపితే వీటి ఏర్పాటు లాంఛనం కానుంది. ఒకవేళ అదే నిజ మైతే.. పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌తో అభివృద్ధి చేయాలన్న తలం పుతో తెలం గాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించినట్లయితే తప్పకుండా విమానాశ్రయాల కల నెరవేరుతుందని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు అభిప్రాయపడు తున్నారు. రోజురోజుకూ విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల కోసం వీటి అవసరం ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు