సమాచారమా...కష్టం!

15 Nov, 2018 01:19 IST|Sakshi

అంతా మా ఇష్టం..

ఆర్టీఐ కమిషనర్‌ ఆదేశాలు బేఖాతర్‌ 

నోటీసులను పట్టించుకోని అధికారులు.. సమాచారం ఇవ్వకుండా దాటవేత ధోరణి

రోజురోజుకూ పెరిగిపోతున్న పెండింగ్‌ కేసులు

జరిమానాలు విధిస్తేనే మార్పు వస్తుందంటున్న దరఖాస్తుదారులు  

వక్కంటి జనార్దన్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో ఓ సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నెలరోజులు దాటినా అతనికి సమాచారం రాలేదు. దీంతో అతను సమాచార కమిషన్‌ను ఆశ్రయించాడు.అక్కడికి సంబంధిత అధికారి కూడా విచారణకు హాజరయ్యారు. ఆ వ్యక్తి అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కమిషనర్‌ అధికారికి ఆదేశాలు జారీ చేశారు.ఆదేశాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ అతనికి సమాచారం లభించలేదు. ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సమాచార హక్కు చట్టంపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సమాచారం అడిగినా స్పందించడంలేదు. చూస్తున్నాం.. పరిశీలిస్తున్నాం అంటూ సమాచారం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. దరఖాస్తుదారుడు కమిషన్‌ను ఆశ్రయించినపుడు కావలసిన సమాచారం ఇస్తామని కమిషనర్‌ ఎదుట హామీ ఇస్తోన్న అధికారులు తరువాత ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. 

జరిమానాలు విధించకపోవడం వల్లేనా? 
దరఖాస్తుదారుడికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని సమాచార కమిషనర్‌ నోటీసులు ఇచ్చినా అధికారులు çపట్టించుకోకపోవడంతో చట్టం సరిగా అమలు కావడం లేదు. ఒకవేళ సదరు అధికారి పదోన్నతి, లేదా బదిలీల కారణంగా సీటు మారితే ఇక అంతే సంగతులు. ఆ సమాచారం ఫైలు అటకెక్కుతుంది. సమాచారం ఇవ్వడంలో కావాలని జాప్యం చేసే అధికారులపై చర్యలు తీసుకునే అధికారం కమిషన్‌కు ఉంటుంది. రోజుకు రూ.250 చొప్పున రూ.25,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అధికారులకు జరిమానాలు విధించకపోవడంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.  

ఎప్పుడు పరిష్కారమవుతాయో! 
సమాచార హక్కు కింద దరఖాస్తులు కొంతకాలంగా వేల సంఖ్యలో పేరుకుపోతున్నాయి. వీటిలో అధికారులు కావాలని జాప్యం చేసేవే అధికం కావడం గమనార్హం. గతంలో జాప్యం చేసిన అధికారులపై కమిషన్‌ చర్యలు తీసుకునేది. ఈ ఏడాది అక్టోబర్‌ వరకు దాదాపు 14 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో కేవలం ఆరు వేల ఫైళ్లు మాత్రమే క్లియర్‌ అయ్యాయని, ఇంకా 9 వేలకుపైగా ఫైళ్లు పెండింగ్‌లోనే ఉన్నాయని సమాచారం. ఆశించిన సమాచారం లభించకపోవడంతో దరఖాస్తుదారులు విసిగిపోతున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చడానికే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 100 శాతం దరఖాస్తుల్లో తెలంగాణలో కేవలం 30 శాతం మాత్రమే పరిష్కారమవడం ఇందుకు నిదర్శనమని వారంటున్నారు. చాలామందికి ఏడాది అవుతున్నా సరైన సమాచారం రావడం లేదని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. సమాచార హక్కు చట్టం కోరలు లేని పులిలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

చర్యలు తీసుకుంటాం: బుద్ధామురళి, ఆర్టీఐ కమిషనర్‌ 
సమాచారం ఇవ్వని అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయి. కమిషన్‌ నోటీసులను నిర్లక్ష్యం చేసిన విషయాన్ని దరఖాస్తుదారులు మా దృష్టికి తీసుకురావాలి. అప్పుడు తప్పకుండా విచారించి
తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. వీలైనంత త్వరగా కేసులను పరిష్కరించేందుకే ప్రయత్నిస్తున్నాం. 

>
మరిన్ని వార్తలు