పెండింగ్ ప్రాజెక్టులకు రూ.11వేల కోట్లు

16 Sep, 2016 01:37 IST|Sakshi
పెండింగ్ ప్రాజెక్టులకు రూ.11వేల కోట్లు

ఇంకా 3 వేల కోట్లు వెచ్చిస్తాం: హరీశ్‌రావు
* రైతుల కళ్లలో ఆనందం చూడటమే సర్కార్ ధ్యేయం
* సంగంబండ రిజర్వాయర్‌కు     నీటి విడుదల

మక్తల్: పెండింగ్ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం  రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా రూ.3 వేల కోట్లు వెచ్చించి మిగతా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకం(సంగంబండ) స్టేజీ-1, స్టేజీ-2లను గురువారం ఆయన ప్రారంభించి సంగంబండ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు.  గురుకుల పాఠశాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. పాలమూరు ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సంగంబండ రిజర్వాయర్‌ను తమ ప్రభుత్వం ప్రారంభించి రైతులకు సాగు నీరందిస్తుందని, ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. టీడీపీ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాటిని అధిగమిస్తామన్నారు. ‘సీఎం కేసీఆర్ రైతు బిడ్డ.. రైతుల సంక్షేమం కోసమే ఆయన ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.. ఎన్ని నిధులైనా వెచ్చించి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తాం’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

విపక్షాల పప్పులుడకవు
పాలమూరు- రంగారెడ్డి, మల్లన్నసాగర్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, అయితే.. వారి పప్పులు ఉడకవని హరీశ్ చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి 18 లక్షల ఎకరాలకు సాగు నీరందించి రైతు కళ్లలో ఆనందం చూడటమే కేసీఆర్ ధ్యేయమని చెప్పారు. వచ్చే సంవత్సరం నాటికి బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా నుంచి లక్షల మంది వలస వెళ్లిన వారు తిరిగి తమ స్వగ్రామాలకు వచ్చి బీడుబారిన పొలాలను సాగు చేసుకునేందుకు అవకాశం వచ్చిందన్నారు.
 
గోదాముల అభివృద్ధికి వెయ్యి కోట్లు
జిల్లాలోని గోదాముల కోసం ప్రత్యేకంగా రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. రాష్ర్టంలో ఎస్సీ రెసిడెన్సియల్ పాఠశాలలు 134 మంజూరు చేయగా.. పాల మూరు జిల్లాకు 24 పాఠశాలలను కేటాయించారని గుర్తు చేశారు. చంద్రబాబు పల్లకీ మోస్తున్న తెలంగాణ  టీడీపీ నాయకులు రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డిలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాజెక్టుల గురించి నోరువిప్పని కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇప్పుడు రద్దు చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

అంతకుముందు మంత్రి హరీశ్‌రావు సంగంబండ రిజర్వాయర్ వద్దకు వెళ్లి పరిశీలించారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు