ప్రాజెక్టులు పట్టాలెక్కేనా..!

6 Jul, 2019 11:08 IST|Sakshi

చర్లపల్లి, యాదాద్రి ప్రాజెక్టులకు నిధులెన్ని?  

ప్రధాన మార్గాల్లో కొత్త రైళ్లు వస్తాయా..!

ఎంఎంటీఎస్‌ రెండో దశ పూర్తి ఎలా?

ప్రాజెక్టుల పురోగతి ఏ తీరునుందో..

‘పింక్‌ బుక్‌’ వస్తే తప్ప తెలియని పరిస్థితి

సాక్షి,సిటీబ్యూరో: కేంద్ర బడ్జెట్‌ ప్రకటించినా రైల్వే కేటాయింపులపై మాత్రం ఉత్కంఠ అలాగే ఉండిపోయింది. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేసినప్పటి నుంచి  రైల్వేల్లో ఏ ప్రాజెక్టుకు ఏ మేరకు నిధులు కేటాయించారు.. కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులేంటి.. అనే అంశాలపై స్పష్టత లేకుండా పోయింది. రైల్వేలకు లభించిన కేటాయింపులు, నిధులు, తదితర అంశాలపై ‘పింక్‌ బుక్‌’లో ప్రవేశపెట్టే వరకు బడ్జెట్‌లో ఏముందో తెలియని పరిస్థితి. ప్రత్యేకించి దక్షిణ మధ్య రైల్వేలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో ఏ మేరకు నిధులు కేటాయించారో.. కొత్తగా చేసిన ప్రతిపాదనలేంటనేది కూడా తెలియని పరిస్థితి. నగరంలో మూడేళ్ల క్రితం ప్రతిపాదించిన చర్లపల్లి, యాదాద్రి ప్రాజెక్టులపై ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు.  అలాగే  చాలాకాలంగా షిరిడీ, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం తదితర నగరాలకు ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా కొత్తగా రైళ్లను నడపాలనే డిమాండ్‌ ఉంది. అలాగే ఆరేళ్ల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్‌ రెండో దశ ఇంకా పూర్తి కాలేదు. తాజా బడ్జెట్‌ నేపథ్యంలో నగరంలోని పెండింగ్‌ ప్రాజెక్టులు  పట్టాలెక్కుతాయా? లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది. దక్షిణమధ్య రైల్వేకు ఏ మేరకు నిధులు కేటాయించారో, ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనాలు లభించనున్నాయో తెలియాలంటే మరో ఒకటి, రెండు రోజుల పాటు ఆగాల్సిందే.  

ప్రతిపాదనలకే యాదాద్రి
ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టులో భాగంగా ఘట్కేసర్‌ నుంచి రాయగిరి వరకు 33 కిలోమీటర్ల మారా>్గన్ని నిర్మించి యాదాద్రికి రైల్వే సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని మూడేళ్ల క్రితం ప్రతిపాదించారు. ఈ మేరకు సర్వే కూడా పూర్తయింది. ఈ  మార్గం అందుబాటులోకి వస్తే ప్రతిరోజు హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయం లభించనుంది. అప్పట్లో  రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుమారు రూ.430 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం 59 శాతం  వాటా, రైల్వే 41 శాతం భరించాలి. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుత బడ్జెట్‌లోనైనా కదలిక ఉంటుందా, నిధులు కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది. 

చర్లపల్లి ప్రాజెక్టు పెండింగే..!
నగరంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో పెరిగిన రద్దీ, రైళ్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి స్టేషన్‌ను 4వ టర్మినల్‌గా విస్తరించేందుకు మూడేళ్ల క్రితం బడ్జెట్‌లోనే ప్రతిపాదించారు. సుమారు రూ.200 కోట్ల అంచనాలతో  ప్రణాళికను సైతం రూపొందించారు. 50 ఎకరాల భూమి అదనంగా అవరమని గుర్తించారు. ఈ టర్మినల్‌ నిర్మిస్తే  10 ప్లాట్‌ఫామ్‌లతో ప్రతిరోజు కనీసం 200 రైళ్ల రాకపోకలకు అవకాశం లభిస్తుందని లెక్కేశారు. విజయవాడ, కాజిపేట్‌ వైపు నుంచి వచ్చే రైళ్లన్నింటినీ చర్లపల్లి నుంచి మళ్లించేందుకు అవకాశం ఉంటుంది. అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు దగ్గరగా ఉండడం వల్ల ట్రాఫిక్‌ చిక్కులు తప్పుతాయి. అన్ని విధాలుగా ఎంతో అనుకూలంగా ఉన్న ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంతో అసలు ఇదీ పూర్తవుతుందా.. లేదా అన్న అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ బడ్జెట్‌లో ఏ మేరకు నిధులు కేటాయిస్తారనేది పింక్‌బుక్‌లోనే ఉంటుంది. 2013లో చేపట్టిన ఎంఎంటీఎస్‌ రెండో దశ గతేడాది నుంచే దశలవారీగా వినియోగంలోకి తేవాలని భావించినా నిధుల కొరతతో పూర్తి కాలేదు.

మరిన్ని వార్తలు