కొత్త ఎత్తిపోతలకు నో..! 

8 Sep, 2018 02:27 IST|Sakshi

పాతవి కొనసాగింపు

ప్రభుత్వ రద్దు నేపథ్యంలో కొత్త ఎత్తిపోతల పథకాలపై నిర్ణయం 

కొత్త ప్రభుత్వంలోనే ఇప్పటికే నిర్మాణంలోని పనులకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయిలో నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వం రద్దయి... ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుండటంతో కొత్త పథకాలను చేపట్టే అవకాశం లేకుండా పోయింది. సాధారణ ఎన్నికల అనంతరమే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం నిర్ణయం చేయాల్సి ఉండటంతో నీటిపారుదల శాఖ పరిధిలో ఉన్న పెండింగ్‌ ప్రతిపాదనలన్నీ ఇక ఫైళ్లకే పరిమితం కానున్నాయి. ప్రభుత్వ రద్దు సూచనలతో హడావుడిగా ఆరు ఎత్తిపోతల పథకాలు కేబినెట్‌ ఆమోదానికి పంపినా, కేబినెట్‌ భేటీ కేవలం ప్రభుత్వ రద్దు నిర్ణయం వరకే పరిమితం కావడంతో వీటిపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. నిజానికి ప్రభుత్వ రద్దు నిర్ణయం ఏ క్షణంలో అయినా వెలువడుతుందన్న నేపథ్యంలో రెండ్రోజుల కిందటే మంత్రులు, ఎమ్మెల్యేలు నీటిపారుదల శాఖపై ఒత్తిడి తెచ్చి ఫైళ్లను ప్రభుత్వ అనుమతికై పంపారు.

ఇందులో నల్లగొండ జిల్లా నుంచి నాలుగు ఎత్తిపోతల పథకాలు, కామారెడ్డి జిల్లా నుంచి మరో రెండు ఎత్తిపోతల పథకాలకు మొత్తంగా రూ.700 కోట్ల పనులకు అనుమతి కోరారు. వీటిపై ప్రభుత్వ రద్దుకు ముందు భేటీ అయిన కేబినెట్‌ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక కాళేశ్వరంలో భాగంగా నిర్మించతలపెట్టిన సంగారెడ్డి కెనాల్‌ పనులకు రూ.1,326 కోట్లతో ప్రతిపాదనలు పంపినా కేబినెట్‌ నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ కాళేశ్వరం నిర్మాణంలోని ప్రాజెక్టు అయినందున దీనిపై ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్థాయిలో నిర్ణయం తీసుకుని జీవో ఇచ్చే అవకాశం ఉంటుందని నీటిపారుదల వర్గాలు చెప్పాయి.

ఈ జీవోకు అనుగుణంగా టెండర్లు పిలిచేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక కల్వకుర్తి పరిధిలో 47 రిజర్వాయర్ల నిర్మాణంపై ఎవరు నిర్ణయం తీసుకోవాలన్న దానిపై సందిగ్ధం ఉంది. ప్రాజెక్టు పాతదే అయినా, 47 రిజర్వాయర్లు పూర్తిగా కొత్త ప్రతిపాదనలు కావడం, నిర్మాణ వ్యయం ఏకంగా రూ.4వేల కోట్లకు పైగా ఉండటంతో దీనిపై ఎలా వ్యవహరిస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఇక కొన్ని ప్రాజెక్టుల పరిధిలో సవరించిన వ్యయ అంచ నాలను ఆమోదించాల్సి ఉంది. ఆపద్ధర్మ ప్రభుత్వం లో ఏ మేరకు సవరించిన అంచనాలను ఆమోదించే అవకాశం ఉందీ, అధికారుల స్థాయిలో ఏ మేరకు చేస్తారన్న దానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది.  

నాలుగు ఎత్తిపోతలకు అనుమతులు 
కేబినెట్‌ గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్తగా నాలుగు ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వరంగల్‌ జిల్లా పరకాల మండల పరిధిలో ముస్తాల్యపల్లి ఎత్తిపోతలకు రూ.8.22 కోట్లు, ఇదే మండల పరిధిలో వెంకటేశ్వరపల్లి ఎత్తిపోతలకు రూ.7.96 కోట్లు, ఖమ్మం జిల్లా రాపల్లి ఎత్తిపోతలకు రూ.12.87 కోట్లు, జగిత్యాల జిల్లా రాయికల్‌ మండల పరిధిలో బోరన్నపల్లి ఎత్తిపోతలకు రూ.1.32 కోట్లతో అనుమతులిచ్చారు. ఇక పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని భట్‌పల్లిలో కొత్తచెరువు నిర్మాణానికి రూ.2.94కోట్లతో అనుమతులు ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.  

మిడ్‌మానేరు నిర్వాసితులకు ఆర్థిక సాయం 
గత కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న మేరకు మిడ్‌మానేరు రిజర్వాయర్‌ పరిధిలోని సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల మన్వాడ నిర్వాసితులకు ఆర్థిక సహాయానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 608 ప్రభావిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.4.25 లక్షల చొప్పున సాయం చేసేలా ఉత్తర్వులిచ్చారు.  

మరిన్ని వార్తలు