పింఛన్ తిప్పలు

22 Jun, 2015 05:04 IST|Sakshi
పింఛన్ తిప్పలు

- నిధులు విడుదలై వారం..
- లబ్ధిదారులకు అందని డబ్బులు
- అర్బన్‌లో బ్యాంకులు, రూరల్‌లో పోస్టాఫీస్‌ల ద్వారా పంపిణీ
- పోస్టాఫీస్‌లలో సాంకేతిక సమస్యలు
- పింఛన్‌దారుల అయోమయం
హన్మకొండ అర్బన్ :
జిల్లాలో గాడిన పడుతున్న ఆసరా పింఛన్ల పంపిణీ వ్యవస్థను ప్రభుత్వ కొత్త ప్రయోగం లబ్ధిదారులను అయోమయూనికి గురి చేస్తోంది. ఇప్పటివరకు పల్లెల్లో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు.. నగరంలో మున్సిపల్ సిబ్బంది పింఛన్ డబ్బులు అందజేసేవారు. ఈ సమయంలో పింఛన్ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో భాగంగా అర్బన్ ప్రాంతంలో 22,061 పింఛన్ దారులకు సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లో జమచేశారు. ఈ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో చేరింది లేనిది ంకా  స్పష్టం కాలేదు. ఎందుకంటే తమ డబ్బులు బ్యాంకుల్లో పడతాయని సమాచారం చాలా మంది పింఛనర్లకు తెలియదు. దీంతో ఎప్పటిలాగే అధికారులే వచ్చి పంపిణీ చేస్తారని చాలా మంది ఎదురు చూస్తున్నారు.
 
సాంకేతిక సమస్యలు

ప్రస్తుతం బ్యాంకుల ద్వారా పంపిణీ చేస్తున్న పింఛన్ల పంపిణీ విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లావాదేవీలు జరపకుండా చాలా కాలం ఉన్న ఖాతాల్లో డబ్బులు వేసినా ప్రస్తుతం పనిచేయదు. ఇక బ్యాంకు ఖాతా నంబర్లు వేల సంఖ్యలో ఉండటం వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉపకార వేతనాల పంపిణీ విషయంలో ఎదురైన అనుభవాలు ఇదే విషయం చెపుతున్నాయి.
 
గ్రామీణ ప్రాంతాల్లో..
ఈ నెల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులకు, వింతంతువులకు, వికలాంగులకు పోస్టాఫీసు ద్వారా అత్యధికంగా 2,14,525 మంది పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. మిగతా 1,74,395 మాత్రం నేరుగా ఉద్యోగులే పంపిణీచేస్తున్నారు. అయితే పోస్టాఫీసుల ద్వారా పంపిణీ విషయంలో గ్రామాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. పోస్టల్ సిబ్బంది పింఛన్‌దారుల వేలి ముద్రలు ఆధారంగా పింఛన్ పంపిణీ చేయాలి. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా మిషన్ ఇస్తారు. అయితే మిషన్ సాంకేతిక లోపం తలెత్తితే ఇబ్బందులు తప్పవు. వేలి ముద్రలు ఏమాత్రం తేడాగా ఉన్నా ఇబ్బందే.  పోస్టాఫీసుల్లో పంపిణీ విషయంలో ఏపీ ఆన్‌లైన్ వారు సర్వీసు ప్రొవైడర్‌గా ఉంటారు. ప్రతి మండలానికి ఒక కో-ఆర్డీ నేటర్‌ను ఏర్పాటు చేయాల్సింది. వీరు సమన్వయంతో వెంటనే సమస్యను పరిష్కరించాలి.
 
మంచం పట్టిన వారికి..
గ్రామంలో పోస్టాఫీసుల ద్వారా పంపిణీ విషయంలో వేలిముద్రలు తప్పనిసరి కాబట్టి ఒక వేళ పింఛన్‌దారు పూర్తి గా నడవలేని స్థితిలో ఉన్నా.. వేలిముద్రలు రాని స్థితి ఉన్నా.. సంబంధిత వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి పరిశీలించి పింఛన్‌దారుల కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి వేలిముద్రలు తీసుకుని పింఛన్ ప్రతి నెలా ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చే విధంగా వేసులు బాటు కల్పించారు.
 
కొన్నిచోట్ల ఇబ్బందులు

పోస్టాఫీస్ సిబ్బంది కొన్నిచోట్ల పింఛన్‌దారులను ఇబ్బందులు పెడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. కొన్నిచోట్ల ఉదయం నుంచి పింఛనర్లు లైన్‌కట్టినా సాయంత్రం ఎప్పుడో పంపిణీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఉదయం, సాయంత్రం, రేపు అంటే తిప్పుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.
 
ఈసారి ముందే...

ప్రతి నెల 20వ తేదీ తరువాత విడుదల చేసే పింఛన్ డబ్బులు ఈ సారి మాత్రం అధికారులు ముందే విడుదల చేశారు. 13 నుంచి పంపిణీ చేపట్టే విదంగా ఆదేశాలిచ్చి నిధులు విడుదల చేశారు.

>
మరిన్ని వార్తలు