ఆసరా చరిత్రాత్మకం

9 Nov, 2014 03:57 IST|Sakshi
ఆసరా చరిత్రాత్మకం

స్టేషన్‌ఘన్‌పూర్‌లో పింఛన్ పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం
 
స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ :  ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పాలిట పెద్దకొడుకులా, పెద్దన్నలా వ్యవహరిస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆసరా పింఛన్ పథకాన్ని నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజయ్య శనివారం లాంఛనంగా ప్రారంభించారు.  స్థానిక మా గార్డెన్స్ ఫంక్షన్‌హాల్‌లో ఎంపీడీఓ సంపత్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీత, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ బాధితులకు ఆసరాగా ఉండే విధంగా కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. సీఎం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, పేదల అభ్యున్నతికి ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నారన్నారు. 65 సంవత్సరాల వయస్సు దాటిన వృద్దులకు నెలకు రూ.1500, గీత, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ బాధితులు, వితంతువులకు నెలకు రూ.1000 పింఛన్ అందించే ఆసరా పథకం చారిత్రాత్మకంగా నిలుస్తుందన్నారు.

గత టీడీపీ ప్రభుత్వంలో 2004 వరకు కేవలం రూ.67కోట్లు పింఛన్లు ఇచ్చేవారని, కాంగ్రెస్ హయాంలో 2014 వరకు రూ.1,032 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో పింఛన్లకు రూ.4వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ పునర్‌నిర్మాణంతో పాటు బంగారు తెలంగాణ సాధించే దిశగా బడ్జెట్ ఉందని రాజయ్య అన్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయడంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యాన్ని అందించేలా కృషి చేస్తానన్నారు. అనంతరం లబ్ధిదారులకు వృద్ధాప్య, వికలాంగ, చేనేత, గీత కార్మిక, వితంతు పింఛన్లు పంపిణీ చేశారు.

ఇబ్బంది ఉంటే 1800200100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయండి : కలెక్టర్ కిషన్
జిల్లాలో పింఛన్ పొందేందుకు అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం నుంచి పింఛన్ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కిషన్ అన్నారు. అర్హులైన పింఛన్‌దారుల జాబితాలో ఎవరివైనా పేర్లు లేకపోతే ఆందోళన చెందవద్దన్నారు. అర్హత ఉన్నప్పటికీ లబ్ధిదారులుగా ఎంపిక కాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా 5.44 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలన కొనసాగుతుందన్నారు.

పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ప్రతీ నెలా ఒకటో తేదీ నుంచి 7వ తేదీ వరకు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పింఛన్లు పంపిణీ చేస్తారని, వివిధ రకాల పింఛన్‌దారులకు పింక్, బ్లూ, గ్రీన్ రంగులలో కార్డులను త్వరలో పంపిణీ చేస్తామన్నారు. ఎవరైనా మా ద్వారానే పింఛన్ వచ్చిందని లంచాలను ఆశిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1800200100 నంబర్‌కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో కలెక్టర్ కిషన్, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ పీడీ శంకరయ్య, ఏపీడీ రాములు, తహసీల్దార్ వాసం రామ్మూర్తి, స్థానిక సర్పంచ్ ఇల్లందుల ప్రతాప్, ఎంపీపీ వంగాల జగన్‌మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు భూక్య స్వామినాయక్, సింగిల్‌విండో చైర్మన్ గట్టు రమేష్, ఎంపీటీసీ సభ్యులు గోనెల ఉపేందర్, డాక్టర్ జైహింద్‌రాజ్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

..వారి దీవెనలే శ్రీరామరక్ష- స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
 
వరంగల్ :
భూపాలపల్లి నియోజకవర్గంలో శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ‘ఆసరా’ పింఛన్ల పంపిణీ శ నివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి, గణపురం, రేగొండ మండలాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో నిరాదరణకు గురవుతున్న వితంతువులు, వృద్ధులు, వికలాంగులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తుందన్నారు. నెలనెల పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల దీవెనలే తమ ప్రభుత్వానికి శ్రీరామర క్ష అని పేర్కొన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు