ఉధృతంగా ఆర్టీసీ సమ్మె

11 Oct, 2019 02:57 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఆర్టీసీ జేఏసీ నేతలు

సాక్షి, హైదరాబాద్‌: తమ డిమాండ్ల సాధన కోసం ఉధృతంగా ఉద్యమించనున్నట్లు ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) తెలిపింది. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, హైకోర్టులో కేసు విచారణకు సంబంధించిన అంశాలపై చర్చించాయి. కార్మికుల సమ్మెకు తమ మద్దతు ఉంటుందని చెప్పాయి. ఉద్యమ కార్యాచరణ రూపొందించి సమ్మెను తీవ్రతరం చేయాల్సిందిగా అభిప్రాయపడ్డాయి. ఆరు రోజులపాటు కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి సమ్మె చేయడం ఐక్యతకు నిదర్శనమని, ఇదే స్ఫూర్తితో డిమాండ్లను సాధించుకోవాలని సూచించాయి.ఆర్టీసీ సమ్మెకు అన్ని వర్గా ల మద్దతు కూడగడితే సమ్మె తీవ్రత పెరుగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. సమ్మెను తీవ్రతరం చేసే క్రమంలో రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంపైనా ఈ భేటీలో చర్చించారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్‌ నిర్వహించే అంశాన్ని సైతం సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కూడా ఉద్యమంలో కలుపుకొని వెళ్తే బాగుంటుందన్న భావనను అందరూ వ్యక్తం చేయడంతో ఆ దిశగా కార్యాచరణ రూపొందించేందుకు ఆర్టీసీ జేఏసీ సమాలోచనలు చేస్తోంది.

సమ్మెకు పూర్తి మద్దతు: పెన్షనర్ల జేఏసీ 
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు పెన్షనర్ల జేఏసీ తెలిపింది. పెన్షనర్ల జేఏసీ చైర్మన్‌ లక్ష్మయ్య అధ్యక్షతన కోర్‌ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. సమ్మెపై సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకోవాలని, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

‘సంఘాలు మద్దతివ్వాలి’
ఆరు రోజులుగా కార్మికులంతా సమ్మె లో ఉండి పోరాట పటిమ చాటారని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మెను తీవ్రం చేసేందుకు రెండు రోజుల కార్యాచరణను ఖరారు చేశామన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బస్‌ డిపోల వద్ద అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. శనివారం గాంధీజీ, జయశంకర్‌ విగ్రహాల వద్ద మౌన దీక్ష చేయనున్నట్లు వివరించారు. కార్మికుల ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ట్రేడ్‌ యూనియన్లను కోరారు. కార్మికులతోపాటు సమ్మెలో పాల్గొంటున్న సూపర్‌వైజ ర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు