రేపు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ధర్మాగ్రహ సభ

10 Nov, 2018 03:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 11న నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగులు, పెన్షనర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ధర్మాగ్రహ సభ నిర్వహిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3.35 నిమిషాలకు సభ ప్రారంభం కానుంది.

ఈ సభకు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 72 సంఘాలు మద్దతు పలికాయి. సీఎం కేసీఆర్‌ ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘ సమావేశం నిర్వహించి పలు హామీలు ఇచ్చినప్పటికీ... వాటిని అమలు చేయకుండా జాప్యం చేశారని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగులు, పెన్షనర్ల జేఏసీ చైర్మన్‌
సీహెచ్‌.సంపత్‌కుమార్‌ స్వామి విమర్శించారు.  

ధర్మాగ్రహ సభ డిమాండ్లివే: జేఏసీ ప్రధానంగా 42 రకాల డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తోంది. ఇందులో సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి. సీఎం హామీ మేరకు ఈ ఏడాది జూన్‌ 2 నుంచి 43% ఐఆర్‌ ఇవ్వాలి. పీఆర్సీ నివేదికను సత్వరమే తెప్పించుకుని అమలు చేయాలి. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు వేతన స్థిరీకరణను అమలు చేయాలి. పెన్షనర్లకు తెలంగాణ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ఉపాధ్యాయులకు సర్వీసురూల్స్‌ అమలు చేయాలి. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులందరినీ వెనక్కి రప్పించాలి.

అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటు, 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు 15 శాతం అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్, ఈహెచ్‌ఎస్‌ ద్వారా నగదు రహిత వైద్యం, భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల అప్‌గ్రెడేషన్, అంతర్‌ జిల్లా బదిలీలు, ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలిరువురూ ఒకేచోట పనిచేసే వెసులుబాటు కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఆన్‌డ్యూటీపై ఉన్నత విద్యార్హతకు అవకాశం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లకు ఓటింగ్‌ అవకాశం, ఉద్యోగులందరికీ సొంత ఇళ్లు తదితర డిమాండ్లపై సభలో చర్చించి తీర్మానం చేయనున్నారు.

మరిన్ని వార్తలు