భర్త వదిలినోళ్లకూ పింఛన్

9 Nov, 2014 02:38 IST|Sakshi

 మంత్రులం చెప్పినా నిబంధనలు మీరొద్దు : మంత్రి ఈటెల
 
 హుజూరాబాద్: భర్త వదిలిపెట్టిన మహిళలకు సైతం పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం యోచిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. భర్తలు పారిపోవడం వల్లనో... వదిలేయడం వల్లనో పిల్లలతో ఇలాంటి మహిళలు దుర్భర జీవితం గడుపుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు. శనివారం మంత్రి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవుళ్ల పేరిట ఉంటూ వివాహం చేసుకోకుండా ఉన్న జోగినిలకూ పింఛన్లు ఇచ్చే ఆలోచన ఉందన్నారు. దశల వారీగా అర్హులందరికీ పింఛన్లు అందుతాయన్నారు. తెలంగాణలో సామాజిక పింఛన్ల కోసం రూ. 6 వేల కోట్లు కేటాయించామన్నారు. పింఛన్లలో పైరవీలకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గ కూడదని, చివరకు మంత్రులు చెప్పినా నిబంధనలు ఉల్లంఘించవద్దని ఆదేశించారు. రేషన్ బియ్యాన్ని 4 కిలోల నుంచి 6 కిలోలకు పెంచామని, కొత్త కార్డులు వచ్చిన తర్వాత ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించారు.  
 

మరిన్ని వార్తలు