మేడారం జాతర.. బస్సులపై బెంగ !

18 Nov, 2019 09:16 IST|Sakshi
గత జాతర సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటుచేసిన క్యూలైన్లు, అందుబాటులో ఉంచిన బస్సులు

సమీపిస్తున్న మేడారం జాతర

భక్తుల తరలింపులో ఆర్టీసీనే కీలకం

సమ్మె నేపథ్యంలో దృష్టి సారించని అధికారులు

కొరవడిన ముందస్తు ప్రణాళిక 

సాక్షి, ఎస్‌ఎస్‌ తాడ్వాయి(వరంగల్‌) : ఆసియాలోనే అత్యధిక మంది భక్తులు వచ్చే మేడారం శ్రీసమ్మక్క – సారలమ్మ జాతరపై ఈసారి సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్‌ పడనుం దా.. ఒకవేళ సమ్మె ముగిసినా భక్తుల రాకపోకల కు అనుగుణంగా బస్సులు సమకూర్చుకుని నడపగలరా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహా జాతర జరగనుంది. అంటే ఇంకా రెండు నెలల సమయం కూడా లేదు. అయినా ఇంత వరకు ఆర్టీసీ నుంచి ఎటువంటి సన్నద్ధత లేకపోవడం భక్తులను కలవరపాటుకు గురిచేస్తోంది.

సన్నద్ధత కరువు
కోటిమందికి పైగా హాజరవుతారనే అంచనాలు ఉన్న మేడారం జాతరకు భక్తులను తరలించడంలో ఆర్టీసీ సంస్థ కీలకంగా వ్యవహరిస్తుంది. జాతరకు నాలుగు నెలల ముందు నుంచే ఆర్టీసీ ఎండీ, ఈడీ వంటి ఉన్నతాధికారులు మేడారం, వరంగల్‌లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేవారు. ఇక్కడి అధికారులను జాతరకు సమాయత్తం చేసేలా సలహాలు, సూచనలు చేసేవారు. ప్రస్తుతం ఆర్టీసీలో నిరవధికంగా కొనసాగుతున్న సమ్మె కారణంగా మేడారం జాతరకు సంబంధించిన ఊసే ఆర్టీసీలో వినిపించడం లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం అంతా కోర్టుల చుట్టూ తిరుగుతుండటంతో ఉన్నాధికారులంతా ఆ పని మీదే దృష్టి కేంద్రీకరించారు. దీంతో జాతరకు సంబంధించి ఆర్టీసీ పరంగా ముందస్తు సన్నద్ధత కరువైంది. 

తగ్గిన బస్సులు
ప్రభుత్వ విధానాలను అనుసరించి  కొత్త బస్సులు కొనడం కంటే అద్దె ప్రతిపాదికన బస్సులను నడిపించడంపై గత కొంత కాలంగా ఆర్టీసీ ఎక్కువ దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం టీఎస్‌ ఆర్టీసీ పరిధిలోని 97 డిపోల్లో 10,640 బస్సులు ఉన్నాయి. వీటిలో అద్దె ప్రతిపాదికన  2140 బస్సులు ఉన్నాయి. సాధారణంగా అద్దె బస్సులను జాతర విధుల నుంచి మినహాయిస్తున్నారు. దీంతో ఆర్టీసీ సంస్థకు 8,320 బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో గరుడ, ఏసీ, మినీ పల్లె వెలుగులు, సిటీ సర్వీసులను మినహాయిస్తే ఈ సంఖ్య మరింతగా తగ్గుతుంది. వీటికి తోడు ఇటీవల ఆర్టీసీ సమ్మెను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఇప్పుడు నడుస్తున్న బస్సుల్లో ఐదువందలకు పైగా బస్సులు పూర్తిగా చెడిపోయినట్లేనని చెప్పారు. గత జాతర అనుభవాలను పరిశీలిస్తే ఆర్టీసీ సంస్థ కనీసం 3,600 బస్సులను జాతరకు కేటాయించాల్సి ఉంటుంది. అంటే సంస్థకు అందుబాటులో ఉన్న బస్సుల్లో సగం జాతరకు కేటాయించాలి. ఈ స్థాయిలో పని జరగాలంటే ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. సమ్మె కారణంగా ప్రస్తుతం ఈ పరిస్థితి కనిపించడం లేదు.

సమ్మె సవాళ్లు
జాతరకు కేటాయించే బస్సులు పూర్తి స్థాయిలో కండీషన్‌లో ఉండాలి. మార్గమధ్యలో బస్సులు మొరాయిస్తే గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ సమస్య ఎదురవుతుంది. గడిచిన నలభై రోజులుగా ఆర్టీసీ సంస్థ అరకొర సౌకర్యాలు, మెకానిక్‌లతో బస్సులను నడిపిస్తోంది. దీంతో బస్సుల కండీషన్‌ దెబ్బ తింటోందని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. అలవాటు లేని వ్యక్తులు నడిపించడం వల్ల బస్సులు త్వరగా దెబ్బతింటున్నాయనేది వారి వాదనగా ఉంది. సమ్మె విషయంలో ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన వల్ల భవిష్యత్తులో ఆర్టీసీలో ఎంత మంది కార్మికులు ఉంటారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. జాతర విధులు నిర్వర్తించేందుకు కనీసం పదివేల మందికి పైగా కార్మికులు అవసరం ఉంటుంది. 

భారీ ప్రణాళిక
రోడ్డు సౌకర్యం మెరుగైనప్పటి నుంచి జాతరకు వెళ్లేందుకు ఆర్టీసీపై ఆధారపడుతున్న భక్తుల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి చేరుకుంది. ఇందుకు తగ్గట్టుగా ఆర్టీసీ సంస్థ జాతర ప్రారంభానికి నాలుగైదు నెలల ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసేది. రాష్ట్ర వ్యాప్తంగా 71 పాయింట్లు ఏర్పాటు చేసేది. ఇక్కడ నుంచి మేడారం వరకు భక్తులు రాకపోకలు సాగించేందుకు నాలుగు వేల బస్సులు అందుబాటులో ఉంచేది. 2012 జాతర నుంచి మూడు వేలకు తక్కువ కాకుండా బస్సులను నడిపించారు. గత రెండు జాతరలలో ఏకంగా 3,600 బస్సులు భక్తులను తరలించేందుకు ఉపయోగించగా, నాలుగు వందల బస్సులు అదనంగా అందుబాటులో ఉంచారు. ఈ బస్సులు నడిపేందుకు సుమారు పదివేల మంది కార్మికులు పని జాతర సమయంలో అహర్నిశలు శ్రమించారు.

మరిన్ని వార్తలు