కేసీఆర్ పాలనలో ప్రజలు భయపడుతున్నారు

6 Jan, 2015 04:49 IST|Sakshi
కేసీఆర్ పాలనలో ప్రజలు భయపడుతున్నారు

ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కారేపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చూసి రాష్ట్ర ప్రజలు భయాందోళనలో ఉన్నారని ఖమ్మం ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ.. 60 ఏళ్ల తెలంగాణ కల సాకారమైనా..టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటినా పాలనపై స్పష్టత లేదని, దీంతో ప్రజలకు ఏమీ అర్థం కావడం లేదని అన్నారు.

అర్హులైన వారికి ఫించన్‌లు రాకపోవడంతో గుండె ఆగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అర్హులైన వారందరికీ పెన్షన్‌లు ఇచ్చి ఆదుకున్నారని, ఎలాంటి కొర్రీలు లేకుండా రైతుల రుణాలు మాఫీ చేశారని, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యం వంటి సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. అయితే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ పూర్తిగా విస్మరించారని విమర్శించారు.

రైతుల వద్ద పంట ఉత్పత్తులు ఉన్నప్పుడే గిట్టుబాటు ధర కల్పించాలని, పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద దళితులకు మూడెకరాలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం జిల్లాలో కేవలం 7 కుటుంబాలకే ఇచ్చిందని, ఇంకా వేల కుటుంబాలకు ఇవ్వాల్సి ఉండగా.. పలు సాకులు చూపి భూమి ఇవ్వకుండా దాట వేస్తోందని  విమర్శించారు. నాగార్జున సాగర్ నీళ్లు రావడం ఆలస్యం కావడంతో..రైతులు నష్ట పోవాల్సి వచ్చిందని, రెండో పంట కన్నా షెడ్యూల్ ప్రకారం సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
 
వీరు పింఛన్‌కు అర్హులు కారా..?
వీరు పింఛన్‌లకు అర్హులు కాదా..? కళ్లు తెరిచి చూడండి.. ఇంత కంటే దౌర్భాగ్యం మరొకటి లేదు..అని పొంగులేటి ఆవే దన వ్యక్తం చేశారు. కారేపల్లి మండలం గుంపెళ్లగూడెం, పేరుపల్లి గ్రామాలలో పలువురు వృద్ధులు, వితంతువులు తమ పింఛన్ రద్దు చేశారని పొంగులేటి ఎదుట  మొరపెట్టుకోగా ఆయన పై విధంగా స్పందించారు.

‘ఇదేనా మనం కన్న బంగారు తెలంగాణా..? వ్యక్తిగతంగా అర్హతను గుర్తించి వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు  ఫించన్‌లు మంజూరు చేయాల్సింది పోయి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు కార్డుల్లో తప్పులు దొర్లాయని, వయస్సు తక్కువ పడిందని, ఇంటి పేరు, అసలు పేర్లు తప్పుగా ఉన్నాయని కుంటి సాకులతో రద్దు చేయడం సరైంది కాదు’ అన్నారు. తాను రాజకీయంగానో,  ప్రతిపక్షంగానో మాట్లాడడం లేదని, ఈ వృద్ధులను చూసి బాధతో మాట్లాడుతున్నానని అన్నారు.

ఈ విషయంలో పేదలకు అన్యాయం చేస్తే అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతామని,  కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట వైఎస్‌ఆర్‌సీపీ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జి బొర్రా రాజశేఖర్, ఎంపీపీ బాణోతు పద్మావతి, మండల అధ్యక్షుడు ఇమ్మడి తిరుపతిరావు, ఎంపీటీసీ ఆలోతు ఈశ్వరీనందరాజ్, నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, టి రాంబాబు, షేక్ సైదులు, వీరన్న, చిలక విజయ ఉన్నారు.

మరిన్ని వార్తలు