ఎస్‌ఐపై అసభ్య పోస్టింగ్‌..

26 Apr, 2017 20:48 IST|Sakshi
ఎస్‌ఐపై అసభ్య పోస్టింగ్‌..

వేములవాడ: సోషల్‌మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టింగ్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం కలకలం రేపింది. ఓ ఎస్ఐపై అసభ్య పదజాలంతో పోస్టింగ్‌ చేసిన విషయాన్ని డిపార్ట్‌మెంట్‌ సీరియస్‌గా తీసుకుంది. పోస్టు చేసిన వ్యక్తితోపాటు లైక్‌లు, కామెంట్లు కొట్టిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిపై చర్యలకు ఉపక్రమించారు. సీఐ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. వేములవాడకు చెందిన వెల్దండి సదానందం ఇటీవల మద్యం తాగి వాహనాన్ని నడుపుతుండగా ఎస్ఐ ఉపేందర్‌ పట్టుకున్నారు.

అతిగా మద్యం తాగిన అతడిని హెచ్చరించి ఇంటికి పంపించారు. ఠాణాకు రావాలని చెప్పేందుకు పోలీసులు సదానందం ఇంటికి వెళ్లారు. దీంతో కోపోద్రికుడైన సదానందం.. పోలీసులతో వాదనకు దిగాడు. అనంతరం తన ఫేస్‌బుక్‌ పేజీలో ఎస్ఐపై అసభ్యపదజాలంతో కూడిన పోస్టింగ్‌ చేశాడు. దీనిని కనికరపు శ్రీనివాస్, రాకేశ్‌, మరికొందరు లైక్‌లు, కామెంట్లు పోస్ట్‌చేశారు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు.. మంగళవారం రాత్రి సదానందంను ఠాణాకు తీసుకొచ్చారు.

శ్రీనివాస్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు. ఎస్ఐ ఉపేందర్, కానిస్టేబుల్‌ రాజునాయక్, ఆలయ ఇన్‌చార్జీ పీఆర్‌వో చంద్రశేఖర్‌ ఫిర్యాదు మేరకు వెల్దండి సదానందం, శ్రీనివాస్, రాకేశ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు