మరుపురాని మహానేత

8 Jul, 2019 08:16 IST|Sakshi
బీబీనగర్‌లో నిమ్స్‌ పనులను ప్రారంభించి మాట్లాడుతున్న వైఎస్సార్‌ (ఫైల్‌)

ఉమ్మడి జిల్లాపై చెరగని ముద్ర వేసిన రాజన్న

నేడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి

ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాపైనా చెరగని ముద్రవేశారు. ఆరోగ్యశ్రీతో ఎందరికో ప్రాణాలు పోసి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి.. రుణమాఫీ, ఉచిత విద్యుత్‌తో అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచారు. నిమ్స్, కాళేశ్వరం ప్రాజెక్టుకు తొలి అడుగులు పడింది వైఎస్‌ హయాంలోనే. హ్యాండ్లూమ్‌ పార్క్, మూసీ కాల్వల ఆధునికీకరణ మహానేత ఘనతే. సోమవారం వైఎస్సార్‌ జయంతి సందర్భగా ఉమ్మడి జిల్లాలో మహానేత హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలైన సంక్షేమ పథకాలపై ప్రత్యేక కథనాలు..

సాక్షి, యాదాద్రి : దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేరరెడ్డి హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పై చెరగని ముద్ర వేశారు. వైఎస్‌ చేపట్టిన పథకాలతో లబ్ధిపొందిన వారు ఆయనను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత, సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన అభివృద్ధి ప్రదాతగా వైఎస్సార్‌ నేడు కీర్తించబడుతున్నారు. జిల్లాలో చేనేత పరిశ్రమను నుమ్ముకుని జీవిస్తున్న వేలా దిమంది వృత్తిదారుల కోసం భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లి మండలం కనుముక్కుల శివారులో పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్క్‌ను ప్రారంభించారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా 10వేల మందికి నేడు ఉపాధి లభిస్తోంది. 

ప్రాణహిత చేవేళ్ల పథకం రూపకల్పన
సాగు నీటి వసతి లేని జిల్లాకు ప్రాణహిత చేవెళ్ల ద్వారా గోదావరి నదీజలాలను అందించడానికి బస్వాపురం రిజర్వాయర్‌ ప్రతిపాదించి పనులను పూర్తి చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత సుజల స్రవంతి పథకం పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ప్యాకేజీ 15,16 ద్వారా బస్వాపురం రిజర్వాయర్, సాగునీటి  కాల్వల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం రీడిజైనింగ్‌ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వైఎస్‌ రూపకల్పన చేసిందే.  జిల్లాలో వృథాగా పోతున్న మూసీ జలాలను రైతులకు అందించడానికి  బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలను  మంజూరు చేసి జిల్లా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్సార్‌.

ఆలేరులో ఆరోగ్యశ్రీ ప్రారంభం..
ఆలేరులో ఆరోగ్య శ్రీ పథకాన్ని 2007లో ప్రారంభించారు. భువనగిరి మండలం వడాయిగూడెంలో 2009లో రూపాయికి కిలో బియ్యం పథకం ప్రారంభించారు. ఫ్లోరిన్‌నీటి నివారణకు ఆలేరు నియోజకవర్గానికి రూ.70కోట్లతో ఉదయసముద్రం నుంచి కృష్ణా నీటి సరఫరా నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఇదేకాక ఉమ్మడి జిల్లాలోనే ఫ్లోరైడ్‌ నివారణకు అంకురార్పణ చేసిన మహనీయుడు రాజశేఖరరెడ్డి. యాదగిరిగుట్టలో రెండో ఘాట్‌ రోడ్డు నిర్మాణం పనులను నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత అభివృద్ధిపై చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్సార్‌.

బీబీనగర్‌లో ఎయిమ్స్‌.. వైఎస్‌ చలవే..
బీబీనగర్‌ శివారులోని రంగాపూర్‌ వద్ద నిమ్స్‌ను ప్రా రంభించింది వైఎస్సారే. ప్రస్తుతం కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్‌ వైఎస్‌ ప్రారంభించిన నిమ్స్‌లోనే కావడం విశేషం. అప్పట్లోనే ఎయిమ్స్‌ తరహాలో నిమ్స్‌ను అభివృద్ధి చేయాలని తపించిన దార్శనికుడు వైఎస్‌. 2005 డిసెంబర్‌ 31న శంకుస్థాపన చేశారు. నిమ్స్‌ పనుల కోసం రూ.100 కోట్లను మంజూరు చేశారు. అనంతరం 2009 ఫిబ్రవరి 22న ఆస్పత్రిని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం నిమ్స్‌లో ఓపి సేవలను ప్రారంభించింది. త్వరలో ఎయిమ్స్‌వైద్య కళాశాల, పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. 

అపరసంజీవని.. 108
 దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి  2005లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 108 వాహనం అపరసంజీవనిగా మారింది. 108వాహన సేవలతో మంది క్షతగాత్రులకు ప్రాణాలు కాపాడుతున్నారు. 2005లో కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా నాలుగు వాహనాలను మాత్రమే కేటాయించి నిర్వాహణ బాధ్యతలను జేవీకే సంస్థకు అప్పగించారు. రెండేళ్ల కాలంలో మంచి ఫలితాలను రావడంతో 2007లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 34 వాహనాలను కేటాయించారు. నిత్యం వందలాది రోడ్డు ప్రమాద బాధితులతో పాటు పాముకాటు, ప్రసవ వేదనలతో బాధపడుతున్న వారిని, ఇతర అత్యవసర వైద్య సేవల కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులకు 108 సిబ్బంది తరలించి వారి ప్రాణాలను కాపాడుతున్నారు.

కేవలం 108 నంబర్‌కు ఫోన్‌ చేసిన పది నిమిషాల్లోనే కుయ్‌.కుయ్‌ మంటూ సంఘటన  స్థనానికి చేరుకుని బాధితులను సకాలంలో సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వారిని కాపాడడంలో 108 నిజంగా అపరసంజీవనిగా నిలుస్తోంది. జిల్లాఓ 108 సేవలకు ప్రారంభించిన నాటి నుంచి అంటే  2005 నుంచి 2009 సంవత్సరం నాటికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మెడికల్‌ ఎమర్జెన్సీ కేసులు 28,999 , ప్రెగ్నెన్సీ రిలేటెడ్‌ కేసులు 6,659, రోడ్డు ప్రమాదాల కేసులు 5,322 మందిని సకాలంలో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి వారి ప్రాణాలను కాపాడడంలో కీలకపాత్రను పోషించింది. 108 సేవలను మరింత బలోపేతం చేసి ప్రజల ప్రాణాలను కాపాడడంలో ప్రస్తుత ప్రభుత్వం కృషి చేయాలని, వైఎస్‌ఆర్‌ ఆశయాలను కొనసాగించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

వెలుగులు నింపిన ‘ రాజీవ్‌ ఆరోగ్యశ్రీ’ 
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అయిన ఆరోగ్యశ్రీ పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపింది. కారొఇ్పరేట్‌ స్థాయి వైద్యాన్ని పొందలేక ఎంతోమంది నిరుపేదల ప్రాణాలను వదిలిన సంఘటనలు చూసిన వైఎస్సార్‌ ఒక డాక్టర్‌గా నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్య సేవలను అందించాలని నిర్ణయించి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు.

2007లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఉమ్మడి జిల్లాలో 2009 నాటికి 18,101 మంది ప్రాణాలను కాపాడింది. తెల్లరేషన్‌ కార్డును తీసుకుని వెళ్లి కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రూ.లక్షల విలువ చేసే వైద్యాన్ని పొంది ప్రాణాలను దక్కించుకున్న వారంతా నేడు వైఎస్‌ రాజశేఖరరెడ్డిని దేవునితో సమానంగా చేతులెత్తి మొక్కుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, యువకులు, మహిళలు అనే బేధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రులతో పాటు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ రకాల జబ్బులకు చికిత్సలు పొందడంతో పాటు శస్త్ర చికిత్సలను చేయించుకున్నారు.

ముఖ్యంగా ఖరీదైన గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల, అత్యవసర చికిత్సలు, కీళ్ల, మెదడు, కేన్సర్, ప్లాస్టిక్‌ సర్జరీ, మూత్రకోశ వ్యాధుల వంటి వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కార్పొరేట్‌ ఆస్పత్రులలో వైద్య సేవలను పొందారు. ఇందుకుగాను సుమారు రూ.53 కోట్ల 22లక్షల 44 వేల 316 రూపాయలు ఖర్చు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం లేకుంటే తాము ఏమైపోయే వారమో అని జిల్లాలోని నిరుపేదలు పేర్కొంటున్నారు. తమకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాణభిక్ష పెట్టారని.. తాము బతికున్నంతకాలం వైఎస్సార్‌ను మరిచిపోలేమని అంటున్నారు.

గోదావరి జలాలు అందించిన అపరభగీరథుడు
50ఏళ్లుగా కరువుకాటకాలు.. దర్భిక్ష పరిస్థితులతో ఉండే తుంగతుర్తి ప్రాంతానికి శ్రీరాంసాగర్‌ కాల్వ ద్వారా గోదావరిజలాలను తీసుకొచ్చిన అపరభగీరథుడు దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌.రాజశఖరరెడ్డి.  ఎస్సారెస్పీ రెండోదశ పనులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 1996 మార్చి 6న తిరుమలగిరి మండలం ప్రగతినగర్‌ వద్ద అప్పటి సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. అయితే  వైఎస్సార్‌ ప్రతిపక్షనేతగా 2003లో ప్రగతినగర్‌ వద్ద టీడీపీ ప్రభుత్వం వేసిన శిలాపలకం వద్ద మొక్కలు నాటి నిరసన తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సారెస్పీ రెండోదశ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఎస్పారెస్పీ రెండోదశ పనులకు  జలయజ్ఞం కింద నిధులు రూ.550 కోట్లు కేటాయించి 80శాతం పనులను పూర్తి చేశారు. 2009 ఫిబ్రవరి 19న వెలిశాలలో ట్రయల్‌రన్‌లో భాగాంగ నీటిని విడుదల చేశారు. ఈ జలాలతో నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపి రైతన్న గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వైఎస్సార్‌. ఈ కాల్వ ద్వారా ప్రస్తుతం నియోజకవర్గంలో సుమారు 70వేల ఎకరాలకు,  జిల్లాలో 2లక్షల 57వేల ఎకరాలకు నీరందుతున్నది. తాగునీటి ఇబ్బందులు కూడా తొలగిపోయాయి.

పేద విద్యార్థులకు వరంలాంటిది
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఫీజురీయిబర్స్‌మెంటు పథకం పేద, మధ్యతరగతి విద్యార్ధులకు వరంలాంటిది. ఈ పథకంతోనే నేను ఇంజనీరింగ్‌ వరకు చదువుకోగలిగాను. ఈ ఫీజురీయంబర్స్‌మెంటు రాకముందు చాలామంది ఆడపిల్లలు ఇంటర్మీడియేట్‌లోనే చదువులను మానివేసేవారు.  వైఎస్‌ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌తో అనేక మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి స్థిరపడ్డారు. ఇప్పుడు నా స్నేహితురాళ్లు కూడా ఇంజనీరింగ్‌ చదువుతున్నారు.   
– కె. ప్రియాంక, ఇంజనీరింగ్‌ విద్యార్థిని, మిర్యాలగూడ
     

మరిన్ని వార్తలు