తొలి పండగ.. ఆనందమే నిండుగా!

29 Mar, 2017 22:26 IST|Sakshi
తొలి పండగ.. ఆనందమే నిండుగా!
– ఆలయాల్లో ఉగాది ప్రత్యేక పూజలు
– పలుచోట్ల పంచాంగ శ్రవణాలు
 
గద్వాల: తీపి, చేదు, వగరు రుచులు.. పంచాంగ శ్రవణం, ఆలయాల దర్శనంతో హేవిళంబినామ సంవత్సరానికి బుధవారం జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎన్నో అనుభూతుల్ని పంచి.. విషాద అనుభవాలను మిగిల్చిన దుర్ముఖినామ సంవత్సరానికి వీడ్కోలు చెప్పారు. ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. హేవిళంబినామ సంవత్సరం అందరికీ విజయం చేకూర్చాలని, ప్రతిఒక్కరూ సుఖసంతోషాలతో గడపాలని మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లాకేంద్రంలోని స్థానిక గాంధీచౌక్‌ నుంచి రాజవీధి వరకు దేవాలయాలు అధికంగా ఉండటంతో సాయంత్రం ట్రాఫిక్‌రద్దీ పెరిగింది.

సాయిబాబ దేవాలయం, గంజిపేటలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం, క్రిష్ణమందిరం, వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం, కోటలోని చెన్నకేశవస్వామి ఆలయం, పెద్దఅగ్రహారంలోని అహోబిల మఠం వద్ద భక్తులు అధికసంఖ్యలో దైవదర్శనం చేసుకున్నారు. అలంపూర్‌ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో భక్తులు విశేషపూజలు చేశారు. మల్దకల్‌ స్వయంభు లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయిజ, శాంతినగర్, గట్టు, ధరూరు, ఇటిక్యాల, మానవపాడు, కేటీదొడ్డి, రాజోలి, ఉండవెల్లి మండలాల్లోని ప్రతిపల్లె కళకళలాడింది.
 
మరిన్ని వార్తలు