నల్లమలలో యురేనియం రగడ

11 Sep, 2019 08:47 IST|Sakshi

ఉధృతమవుతున్న యురేనియం వ్యతిరేక ఉద్యమాలు 

9న చేపట్టిన నల్లమల బంద్‌ విజయవంతం  

నల్లమలలో 4 వేల బోర్‌పాయింట్ల గుర్తింపునకు కసరత్తు 

దేవరకొండకు చేరుకున్న 30 మంది జియాలజిస్టులు 

రాష్ట్రస్థాయిలో ఉద్యమాలకు సిద్ధమవుతున్న పార్టీలు, ప్రజాసంఘాలు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమలలో ఉద్యమాలు ఉధృతం అవుతున్నాయి. యురేనియం తవ్వకాలు జరపొద్దంటూ ఓ వైపు పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రజా సంఘాలు, రాజకీయ పారీ్టలు, స్థానిక ప్రజలు ఆందోళనలు చేపడుతుండగా.. మరోవైపు తవ్వకాలకు సంబంధించిన సన్నాహాలను యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) ముమ్మరం చేసింది. ఇప్పటికే నల్లమల అటవీ ప్రాంతంలో 21 వేల ఎకరాల విస్తీర్ణంలో నమూనాల సేకరణకు కేంద్ర అణుశక్తి సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు పరిధిలోని మొత్తం 83 కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియం నిల్వల పరిమాణం, నాణ్యతలను తెలుసుకునేందుకు అనుమతిం చాలని తెలంగాణ అటవీ శాఖను కోరింది. అందుకనుగుణంగా నాగర్‌కర్నూలు జిల్లా అటవీశాఖ అధికారులు నివేదికలను తయారు చేసినట్లు సమాచారం. అయితే బోర్లు ఎక్కడెక్కడ వేస్తారన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో ముందే బోర్‌ పాయింట్లను గుర్తించేందుకు జియాలజిస్టులను రంగంలోకి దింపారు. ఇప్పటికే నల్లగొండ జిల్లా దేవరకొండకు చేరుకున్న 30 మంది జియాలజిస్టులు నేడో, రేపో నాగర్‌కర్నూలు జిల్లా పరి«ధిలోని నల్లమలకు వచ్చే అవకాశం ఉంది. 

జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం 
ప్రకృతి సంపద, జీవ వైవిధ్యానికి పెట్టింది పేరైన అటవీ ప్రాంతంలో యురేనియం నమూనాల సేకరణకే 4వేల బోర్లు వేయనుండటంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. యురేనియం అన్వేషణకు నాగర్‌కర్నూలు జిల్లా ఉడిమిల్ల, పదర, నల్లగొండ జిల్లా అటవీ డివిజన్‌లోని నారాయణ పురం నల్లమల పెద్ద పులుల రక్షిత ప్రాంతంలో 4 వేల బోర్లు వేస్తామని ఏఎండీ పేర్కొంది. బోర్ల తవ్వకాలు, వాహనాల శబ్దాలు, జన సంచారంతో నల్లమల అటవీ ప్రాంతానికి, పెద్ద పులులతో సహా వన్యప్రాణులకు తీవ్ర నష్టం జరుగనుందనే ఆం దోళన వ్యక్తం అవుతుంది. యురేనియం తవ్వకాలు జరిగే ప్రదేశంలో వెలువడే కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల కేన్సర్, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. యురేనియం శుద్ధికి కృష్ణా జలాలను వినియోగిస్తే మత్స్య సంపద  నాశనమవుతుందని పర్యావరణ వేత్తలంటున్నారు. అలాగే హైదరాబాద్‌ వాసులకు మంచి నీరు బదులు విషపు నీరు సరఫరా అవుతుందని, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్, నల్లగొండతో పాటు ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలు దెబ్బతింటాయని  వెల్లడిస్తున్నారు.

వ్యతిరేక ఉద్యమాలు ఉధృతం.. 
నల్లమలలో 112 చెంచుపెంటల్లో దాదాపు 12 వేల మంది చెంచులు నివసిస్తున్నారు. యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వడం వల్ల అడవిని నమ్ముకొని జీవిస్తున్న చెంచులు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం వచి్చంది. సుమారు 70 రకాల వన్యప్రాణులకు కూడా ముప్పు కలగనుంది. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని దాదాపు 18 గ్రామ పంచాయతీలు ప్రమాదంలో పడనున్నాయి. దీంతో యురేనియం తవ్వకాల వల్ల ఆ చెంచు జాతిని మరింత ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నాలపై ప్రజా సంఘాలు, పారీ్టలు పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. యురేనియంను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ కోర్‌ కమిటీ ఉద్యమానికి సిద్ధం కావడం, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ కూడా యురేనియం తవ్వకాలను జరపొద్దంటూ ప్రకటించడం, కోదండరాం, రేవంత్‌రెడ్డి ఇప్పటికే నల్లమలలో పర్యటించడంతో ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  9న  నల్లమల బంద్‌ కూడా విజయవంతమైంది.

జిల్లాకు జియాలజిస్టులు రాలేదు
యురేనియం తవ్వకాల సర్వే కోసం బోర్‌పాయింట్లు గుర్తించేందుకు జిల్లాకు జియాలజిస్టులు రాలేదు. కేంద్ర అణుశక్తి సంస్థ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఆమ్రాబాద్, పదర మండలాల పరిధిలో దాదాపు 21 వేల ఎకరాలు భూమి కావాల్సి ఉంటుంది. అందులో 4 వేల బోర్లు వేయనున్నారు. బోర్‌వెల్స్‌ గుర్తించిన పాయింట్లకు ఏవిధంగా వెళ్లాలి. బోర్‌ పాయింట్లు ఎక్కడనేది స్పష్టత వస్తే ప్రభావంపై అంచనా వేస్తాం. ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు పంపలేదు.  – జోజి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్‌ 

మరిన్ని వార్తలు