‘వర్సిటీ’ ఊసేది..?

1 Oct, 2019 10:00 IST|Sakshi
కొత్తగూడెంలోని మైనింగ్‌ కళాశాల

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు లేని విశ్వవిద్యాలయం

గిరిజన వర్సిటీ రాలేదు.. ‘మైనింగ్‌’ ప్రక్రియ ముందుకు కదల్లేదు

2017 అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చ

సాక్షి, కొత్తగూడెం: ఉన్నత విద్యను యువతకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గతంలో రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కానీ అనేక అవకాశాలు ఉన్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మాత్రం ఇప్పటివరకు ఒక్క వర్సిటీ కూడా మంజూరు కాలేదు. ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉన్నందున ఇక్కడ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉండేది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ వర్సిటీని ములుగులో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో కొత్తగూడెంలో  మైనింగ్‌ యూనివర్సిటీ తప్పకుండా ఏర్పాటు చేస్తారనే ఆశలు ఉమ్మడి జిల్లా వాసుల్లో ఉన్నాయి. సింగరేణి కేంద్ర కార్యాలయం ఉన్న కొత్తగూడెంలో సింగరేణి ప్రధాన ఆస్పత్రి సైతం ఉంది. దీంతో సింగరేణి ఆధ్వర్యంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉన్నా.. అది కూడా ఎప్పటికప్పుడు వెనక్కే వెళుతోంది. చివరకు మైనింగ్‌ వర్సిటీ ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ దీనిపైనా స్పష్టత లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీకి ముఖ ద్వారంగా ఉన్న కొత్తగూడెంలో మైనింగ్‌ వర్సిటీ విషయమై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అనుకూలంగా సిఫారసు చేసినప్పటికీ ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. 

దినదినాభివృద్ధి చెందుతున్న ‘గూడెం’.. 
జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, సింగరేణి పుట్టిల్లయిన ఇల్లెందు ప్రాంతాలు బొగ్గు గనులతో భాసిల్లుతున్నాయి. మరోవైపు జిల్లా పారిశ్రామిక ప్రాంతంగా కూడా మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళుతోంది. కొత్తగూడెంలో సింగరేణి కేంద్ర కార్యాలయం ఉండడంతో పాటు జిల్లా కేంద్రంగా ఆవిర్భవించాక మరింత అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడున్న కొత్తగూడెం స్కూల్‌ ఆఫ్‌ మైనింగ్‌ను జార్ఖండ్‌ రాష్ట్రంలో ఉన్న ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైనింగ్‌ తరహాలో అభివృద్ధి చేసేందుకు నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు చేశారు. ఇందుకు సంబంధించి వివిధ దశల్లో కసరత్తు సైతం చేశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా సానుకూలంగానే వెళ్లాయి. సింగరేణి గనులతో పాటు పాల్వంచలో కేటీపీఎస్, అశ్వాపురంలో భారజల కర్మాగారం, ఐటీసీ పరిశ్రమలు ఉన్నాయి. కొత్తగా మణుగూరు–పినపాక మండలాల సరిహద్దుల్లో భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నిర్మిస్తున్నారు. ఇలా పారిశ్రామిక రంగంలోనూ జిల్లా దూసుకెళుతోంది.

మైనింగ్‌ స్కూల్‌నే యూనివర్సిటీగా... 
జిల్లాలో 400 ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్న కొత్తగూడెం స్కూల్‌ ఆఫ్‌ మైనింగ్‌ను ధన్‌బాద్‌ తరహాలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైనింగ్‌ లేదా మైనింగ్‌ యూనివర్సిటీగా మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం కొత్తగూడెం స్కూల్‌ ఆఫ్‌ మైనింగ్‌లో మైనింగ్, ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌ఈ, ఐటీ కోర్సులు ఉన్నాయి. ఇందులో సుమారు 800 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ క్రమంలో 2016లో  రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య కె.సీతారామారావు ఇతర నిపుణలు ఉన్నారు. కొత్తగూడెం ఏరియాకు పలుమార్లు వచ్చిన ఈ కమిటీ 2016 సెప్టెంబర్‌ 26న చివరిసారిగా పర్యటించి.. కొత్తగూడెం స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌ను ‘మైనర్‌ అండ్‌ టెక్నలాజికల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ’గా ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. కొత్తగూడెం రుద్రంపూర్‌లో ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలను సైతం ఇందులో విలీనం చేయాలని సూచించింది.

అసెంబ్లీలో చర్చ... 
2017 చివరిలో జరిగిన అసెంబ్లీ సమావేశా ల్లోనూ ఈ అంశం చర్చకు రాగా, నాటి మంత్రి కడియం శ్రీహరి వర్సిటీ ఏర్పాటుకు తగిన విధంగా ముందుకు వెళతామని హామీ ఇచ్చారు. 2018 మార్చిలో మైనింగ్‌ విశ్వవిద్యాలయం పై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని భావించినా అది నిరాశే అయింది. ప్రస్తుత గవర్నర్‌ తమిళిసై మైనింగ్‌ వర్సిటీ ఏర్పాటుపైనా చొరవ తీసుకోవాలని విద్యాభిమానులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా