సూరీడు @ గ్రేటర్‌

27 Dec, 2019 10:10 IST|Sakshi
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ వద్ద సోలార్‌ ఫిల్టర్‌తో సూర్యగ్రహణాన్ని వీక్షిస్తున్న పల్లీలు విక్రయించే వృద్ధురాలు

సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు బిర్లాప్లానిటోరియం, ఉస్మానియా వర్సిటీలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కావడంతో సూర్య గ్రహణాన్నివీక్షించేందుకు గ్రేటర్‌ వాసులు ఆసక్తి కనబర్చారు. గురువారం ఉదయం 8.15 నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం దాదాపు 3 గంటల పాటు సాగింది. గ్రహణాన్ని వీక్షించకూడదన్న అపోహలతో ప్రజలు బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ బోసిపోగా, సంప్రోక్షణ అనంతరం ఆలయాలుతెరుచుకున్నాయి.  

సాక్షి, సిటీబ్యూరో: ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. చాలా ఏళ్ల తర్వాత గురువారం ఉదయం వేళల్లో ఆకాశంలో  సూర్యగ్రహణం కనువిందు చేయడంతో దానిని వీక్షించేందుకు నగరవాసుల్లో కొందరు ఇళ్లపై నిల్చుని ఆసక్తిగా ఆకాశం వైపు చూడగా....మరికొందరు అపోహలతో ఇంటి నుంచి కనీసం బయటికి కూడా రాలేదు. ఉదయం 8.15 నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం దాదాపు 3 గంటల పాటు సాగింది. గ్రహణాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు దేవాలయాల్లో పూజలతో పాటు దర్శనాలను నిలిపివేశారు. ప్రధాన ద్వారాలకు తాళాలు వేశారు.

సూర్యగ్రహణంపై ఇప్పటికీ ప్రజల్లో అనేక అపోహలు ఉండటంతో చాలా మంది బయటికి రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. సందర్శకులతో నిత్యం రద్దీగా కనిపించే చార్మినార్‌ సహా పలు పర్యాటక ప్రాంతాలు బోసిపోయాయి. ఇదిలా ఉండగా అరుదుగా సంభవించే ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు బిర్లా ప్లానిటోరియం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సూర్యగ్రహణం అనంతరం ఆయా దేవాలయాల్లో సంప్రోక్షణ నిర్వహించి, మధ్యాహ్నం తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించా రు.  జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదని పేర్కొంటూ వారంతా స్వయంగా ఆహారం తీసుకుని చూపించారు.

మరిన్ని వార్తలు