బ్యాంకుల్లో బారులు

15 May, 2018 07:34 IST|Sakshi
నిర్మల్‌ ఎస్‌బీఐ ప్రధానశాఖలో కిక్కిరిసిన రైతులు

చెక్కులతో వస్తున్న అన్నదాతలు

భారీ క్యూలైన్లు, సర్వర్‌ సమస్యలు

ఐదురోజుల్లో 64వేల చెక్కులు పంపిణీ

డబ్బు పొందింది 4,855 మందే..

జిల్లాలో కొనసాగుతున్న రైతుబంధు

సాక్షి, నిర్మల్‌: ఈనెల 10న ప్రారంభమైన రైతుబంధు పథకం జిల్లాలో ప్రశాంతంగా సాగుతోంది. సోమవారం వరకు సుమారు 64వేల మంది రైతులు చెక్కులు పొందారు. ఇందులో 4,855మంది రైతులు సంబంధిత బ్యాంకుల్లో చెక్కుల ద్వారా రూ.5.70కోట్లు తీసుకున్నారు. గ్రామాల్లో చెక్కులు పొందిన రైతన్నలు బ్యాంకుల బాట పడుతుండగా అవి ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. బ్యాంకుల వద్ద టెంట్లు, తాగునీటి వసతి కల్పించినా.. తరచూ కొన్ని బ్యాంకుల్లో సర్వర్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో గంటలపాటు నిరీక్షించాల్సి వస్తోంది.

బ్యాంకుల్లో సందడి షురూ..
రైతుబంధు పథకం ఈనెల 10న ప్రారంభమైంది. రైతులు చెక్కులు పొందినప్పటికీ డబ్బులు తీసుకునే అవకాశం సోమవారం వరకు రాలేదు. రెండో శనివారం, ఆదివారం బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. అధికారులు కూడా చాలా గ్రామాల రైతుల చెక్కులపై ఈనెల 14 తర్వాత తీసుకునే తేదీలను వేశారు. ఈనేపథ్యంలో సోమవారం నుంచే బ్యాంకుల్లో సందడి ప్రారంభమైంది. జిల్లాలో నిర్మల్‌ అర్బన్‌ మండలంలో కార్పొరేషన్‌ బ్యాంకు ద్వారా, తానూరు, కుంటాల, కుభీర్, దస్తురాబాద్, మామడ మండలాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా, లోకేశ్వరం, దిలావర్‌పూర్‌ మండలాల్లో ఆంధ్రాబ్యాంకు ద్వారా, మిగతా 11మండలాల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా రైతులకు చెక్కులను పంపిణీ చేస్తున్నారు. 

పొద్దున్నుంచే బారులు..
జిల్లాకేంద్రంతో పాటు వివిధ మండలాల్లో ఉన్న బ్యాంకుల వద్ద సోమవారం ఉదయం నుంచే రైతులు బారులుతీరారు. ఐదురోజులుగా పంపిణీ పూర్తిచేసిన గ్రామాలకు చెందిన రైతులు బ్యాంకులకు తరలివస్తున్నారు. బ్యాంకు అధికారులు టెంట్లతో పాటు, వారి కోసం తాగునీటి వసతులు ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్‌ పాటిస్తూ.. వరుసక్రమంలో చెక్కులను అందజేస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. జిల్లాకేంద్రంలోని సంబంధిత బ్యాంకులు కిక్కిరిసిపోతున్నాయి. రైతులతో పాటు రోజువారీగా వచ్చే ఖాతాదారులతో నిండిపోతున్నాయి. ఈక్రమంలో రైతులకు ప్రత్యేక క్యూలైన్‌లను ఏర్పాటు చేసి చెక్కులను అందజేస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లో మాత్రం సర్వర్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో గంటల పాటు రైతులు వేచిచూడాల్సి వస్తోంది.

నమ్మి మోసపోవద్దు..
బ్యాంకుల వద్ద చెక్కులు డ్రా చేసుకునేప్పుడు రైతులు ఎవరి మాటలను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి వద్ద నుంచి డబ్బులు కాజేసే ప్రయత్నం చేసేవాళ్లూ ఉంటారని హెచ్చరిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని పలు బ్యాంకులను సోమవారం పట్టణ సీఐ జాన్‌దివాకర్‌ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా క్యూలైన్ల ద్వారా వెళ్లేలా సిబ్బందిని ఉంచామని చెప్పారు. అలాగే అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దని అవగాహన కల్పిస్తున్నామని సీఐ పేర్కొన్నారు.

ప్రశాంతంగా సాగుతున్న పంపిణీ..
జిల్లావ్యాప్తంగా రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ ప్రశాంతంగా సాగుతోంది. కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్మోహన్‌ తదితరులు సారంగపూర్‌ మండలం జామ్‌ గ్రామానికి వచ్చారు. పలువురు రైతులకు చెక్కులు, పాసుబుక్కులు అందించడంతో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. యాసంగికి సంబంధించి నవంబర్‌ నెలలో ఎకరాకు రూ.4వేల చొప్పున చెల్లించనున్నట్లు వెల్లడించారు.

జిల్లాలో మొత్తం రైతులు : 1, 65, 670
మొత్తం చెక్కులు : 1,67,153
పెట్టుబడి సాయం : రూ.175.01కోట్లు
ఐదురోజుల్లో చెక్కుల పంపిణీ : 64,000
డబ్బులు పొందిన రైతులు : 4,855
డ్రా చేసుకున్న మొత్తం : రూ.5,70,07,830

పైసల కోసం అచ్చిన
సార్లు ఊరికి అచ్చి చెక్కు ఇచ్చిండ్రు. మా దగ్గర బ్యాంకు లేదు. పైసల కోసం నిర్మల్‌ అచ్చిన. సర్కారు చేస్తున్న సాయం మంచిగున్నది. కొంచెం పైసలు తీసుకునతందుకే తిప్పలైతుంది. – లింగన్న, గోపాల్‌పేట్, సారంగపూర్‌ మండలం

వేచిచూడాల్సి వస్తోంది
రైతుబంధు చెక్కులు డ్రా చేసుకునేందుకు వచ్చిన రైతుల కోసం బ్యాంకుల్లో ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఒక్కోసారి సర్వర్‌ పని చేయడం లేదని చెబుతున్నారు. దీంతో చాలాసేపు వేచిచూడాల్సి వస్తోంది.– లోకమాన్య, భాగ్యనగర్, నిర్మల్‌రూరల్‌ మండలం

అపరిచితులను నమ్మవద్దు
చెక్కులు డ్రా చేసుకునేందుకు వచ్చే రైతులు బ్యాంకుల వద్ద ఎవరినీ నమ్మవద్దు. గుర్తు తెలియని వ్యక్తులతో సంబంధం లేకుండా నేరుగా బ్యాంకు అధికారుల నుంచే డబ్బులు తీసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలి.– జాన్‌దివాకర్, పట్టణ సీఐ, నిర్మల్‌ 

మరిన్ని వార్తలు