ఇళ్లపై పడుతున్న ఓసీపీ బండరాళ్లు

21 Aug, 2019 12:03 IST|Sakshi
బండరాయి పడి పగిలిన పైకప్పు రేకు, ఇంట్లో పడిన బండరాయి

భయాందోళనలో కాలనీవాసులు

పట్టించుకోని అధికారులు 

సాక్షి, భూపాలపల్లి : భూపాలపల్లి ఏరియాలోని ఓసీపీలో బాంబుల మోతలకు కాలనీ వాసులు బెంబేలెత్తుతున్నారు. ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు–2లో జరుగుతున్న బొగ్గు, మట్టి వెలికితీత పనుల్లో భాగంగా చేపడుతున్న బాంబు బ్లాస్టింగ్‌లతో మంగళవారం బండరాళ్లు వచ్చి సమీప కాలనీల్లోని ఇళ్లపై పడినాయి.  ఓసీపీ–2 సమీపంలోని గాంధీనగర్‌ కాలనీలోని చిక్కుల దేవేందర్‌ ఇంటిపై సుమారు 5 కిలోల బరువు గల  బండరాయి పడడంతో పై కప్పు రేకులు పగిలిపోయాయి. అయితే ఆ సమయంలో దేవేందర్‌ భార్య ఇంట్లోనే నిద్రిస్తున్నప్పటికీ బండరాయి ఆమె మీద పడకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.  

నిబంధనలు గాలికి
కాలనీలకు 500 మీటర్ల దూరంలో ఓసీపీలో బాంబు బ్లాస్టింగ్‌ పనులు చేపట్టాలని నేషనల్‌ గ్రీన్‌ట్రిబ్యూనల్‌ సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కేవలం వంద మీటర్ల దూరంలోనే బ్లాస్టింగ్‌లు చేపట్టడం వలన ఇలా బండరాళ్లు వచ్చి ఇళ్లపై పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా పేలుళ్ల శబ్దంతో గోడలు  పగుళ్లు బారుతున్నాయని వాపోయారు. బ్లాస్టింగ్‌ చప్పుళ్లతో బెంబేలెత్తుతున్న జనం ప్రతి రోజు రెండు సార్లు బాంబుబ్లాస్టింగ్‌ చేయడం వలన ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని జంగేడు, పక్కీరుగడ్డ, ఆకుదారివాడ, సుభాష్‌కాలనీ, గాంధినగర్, శాంతినగర్‌ కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

నిబంధనలకు వ్యతిరేకంగా అధిక సామర్థ్యం గల బాంబులను వినియోగించడం వలన ఇళ్లు కదులుతున్నాయని బాధితులు గోడును వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఓసీపీ–1లో చేపట్టిన బ్లాస్టింగ్‌ వలన గడ్డిగానిపల్లి గ్రామంలోని ఇళ్లపైన బండరాళ్లు పడిన సందర్భాలు ఉన్నాయి. అయిన్నప్పటికీ ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టడంలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. 

>
మరిన్ని వార్తలు