క్వారంటైన్‌ కష్టాలు..

1 Apr, 2020 02:14 IST|Sakshi

విదేశాల నుంచి వచ్చి అవస్థలు పడుతున్న తెలుగువాళ్లు

ఫారిన్‌ రిటర్న్‌డ్‌ అని దూరం పెడుతున్న కాలనీవాసులు

ఇంటి కిటికీలు తెరిచినా సహించని ప్రజలు.. 

క్వారంటైన్‌పై అపోహలు తొలిగితేనే ‘విదేశాల’ లెక్క తేలేది

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలోని ఉప్పల్‌ ప్రాంతానికి చెందిన నాగరాజు (పేరు మార్చాం) మొన్నటివరకు జర్మనీలో ఉండి వచ్చారు. మొన్నటి వరకు ఆ కాలనీలో అతడో సెలబ్రిటీ.. కానీ ఇప్పుడు అతడిని అంటరానివాడిగా ఆ కాలనీవాసులు చూస్తున్నారు. గచ్చిబౌలిలో నివసించే అరుణ్‌ (పేరు మార్చాం) లండన్‌ నుంచి వచ్చాడు. అతడు ఉండే అపార్ట్‌మెంట్‌లో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాడు. ఇతడి ఫ్లాట్‌ తలుపులు, కిటికీలు తెరిచినా పక్కింటి వారు, అపార్ట్‌మెంట్‌వాసులు అంగీకరించట్లేదు. క్వారంటైన్‌లో ఉన్న మనిషిని ఇంట్లో పెట్టుకుని యథేచ్ఛగా తలుపులు తీస్తారా? అని ఆయన కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగుతున్నారు.

ఇవి రెండే కాదు.. విదేశాల నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్న వందలాది మంది విదేశాల నుంచి వచ్చిన వారి గోస ఇది. గతంలో పూలు అమ్మిన చోట ఇప్పుడు రాళ్లు అమ్ముకుంటున్న పరిస్థితులు. గతంలో ఉన్న గౌరవాన్ని కరోనా మింగేయడంతో ఓ రకంగా వివక్షపూరిత జీవనం కొనసాగిస్తున్నారు. ఎంతగా అంటే.. కనీసం వారికి అన్నం పెట్టేందుకు కుటుంబసభ్యులు కూడా భయపడేంత.

మార్పు వస్తేనే మేలు..
ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల నుంచి వారికి దూరంగా ఉండటమే మంచిది. కానీ వారికి కరోనా సోకినా, సోకకున్నా తన చుట్టుపక్కల ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలన్న నిబద్ధతతో తమకు తాము 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటున్న వారిని కించపరిచేలా వ్యవహరించడం తగదని అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు వైద్యులు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారందరిలో ఈ వైరస్‌ లేదని, అయినా ముందు జాగ్రత్తగా మాత్రమే వారిని స్వీయ నిర్బంధంలో ఉం చామని, వారి పట్ల అమానుషంగా వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా యి. కరోనా వైరస్‌ సోకిన వారిని తాకినప్పుడు ఈ వైరస్‌ వస్తుందని, అది కూడా ఆ వ్యక్తి తన ముఖ భాగాలను చేతితో తాకితేనే శరీరంలోకి ప్రవేశిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికి వారు వారి ఇళ్లల్లో ఉన్నా.. ఒకవేళ బయటకు వచ్చినా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ చేతులు తరచూ కడుక్కున్నా.. తన ముఖ భాగాలను తాకకపోయి నా ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించదన్న వాస్తవాన్ని గుర్తించాలని సూచి స్తున్నారు.

క్వారంటైన్‌లో ఉన్న వారు తమ పరిసరాల్లో ఉన్నంత మా త్రాన భయపడాల్సిన పని లేదనే విషయాన్ని గ్రహించాలని కోరుతున్నారు. ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాపించేది కాదు కాబట్టి క్వారంటైన్‌లో ఉన్న వారు నివసించే ప్లాట్లు, ఇళ్ల తలుపులు తెరచి ఉన్నంత మాత్రాన ప్రమాదమేమీ లేదని వివరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్‌లో ఉండటంపై సమాజం అపోహలు తొలగించుకోవాలని, వారిలో ధైర్యం కల్పించినప్పుడే విదేశాల నుంచి వచ్చిన వారంతా ఇళ్లకు పరిమితమవుతారని, అప్పుడే ఈ వైరస్‌ నియంత్రణలోకి వస్తుందనే వాస్తవాన్ని మాత్రం విస్మరించొద్దని సూచిస్తున్నారు. రాష్ట్రంలో తొలి కరోనా వైరస్‌ బాధితుడు రామ్‌తేజ్‌ మన్‌ కీ బాత్‌లో ప్రధారి నరేంద్ర మోదీతో చెప్పిన విధంగా క్వారంటైన్‌ అంటే జైలు జీవితం కాదని, అలాంటి వివక్షను ఈ సమాజం విదేశాల నుంచి వచ్చిన వారికి ఇవ్వడం వల్ల వారు మరింత భయపడితే అసలుకే ఎసరు వస్తుందని గుర్తుంచుకోవాలి. అందుకే సాటి మనిషిని గౌరవించడం నేర్చుకోండి.. క్వారంటైన్‌లో ఉన్నవారినే కాదు కరోనా వైరస్‌ సోకిన వారిని కూడా అవమానించొద్దని చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు