ఎలా.. ఇలా?

30 May, 2020 08:29 IST|Sakshi

లాక్‌డౌన్‌ సడలించినా కరోనాపై తొలగని అనిశ్చితి

పదే పదే అదే ధ్యాస

గ్రేటర్‌లో పెరుగుతున్న ఆందోళన, కుంగుబాటు

మానసిక సన్నద్ధతను పెంచుకోవాలంటున్న నిపుణులు  

సాక్షి, సిటీబ్యూరో:  కరోనా..లాక్‌డౌన్‌ మనుషుల జీవితాలపై తీవ్ర ప్రభావాన్నే చూపాయి.  ఏ వైపు నుంచి  వచ్చి కబళిస్తుందో  తెలియని  కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు దాదాపు యాభై రోజుల పాటు జనం ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరమైతే  తప్ప  గడపదాటలేదు. కానీ ఆ నిర్బంధ జీవితం ఒకరకమైన అనుభవాన్ని పరిచయం చేసింది. లాక్‌డౌన్‌ కష్టాలు, బాధలు  కల్లోలాన్ని రేపాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రశ్నార్థకం చేశాయి. ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలింపులతో జనం బయటకు వస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు,సినిమాహాళ్లు వంటివి మినహా అన్ని రకాల దుకాణాలు తెరుచుకున్నాయి. సాధారణ జనజీవితం కనిపిస్తోంది. కానీ రోజు రోజుకూ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు  మాత్రం  మానసిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. కొత్తగా తెరపైకి  వచ్చిన  కరోనా కట్టుబాట్లు మనుషుల మధ్య సుడిగుండాలను సృష్టిస్తున్నాయి. మహమ్మారి బారినుంచి ఎప్పటి వరకు బయటపడగలమో తెలియని అనిశ్చితి వెంటాడుతోంది. ఆందోళన, కుంగుబాటు, ‘డాక్టర్స్‌ షాపింగ్‌’ వంటి మానసిక లక్షణాలు పెరిగాయి. కరోనాతో కలిసి జీవించడం ఆరంభమైన ప్రస్తుత తరుణంలో మానసిక సన్నద్ధతను పెంచుకోవడమే పరిష్కారంగా చెబుతున్నారు నిపుణులు.

ఇదే ‘రియల్‌టైమ్‌’ ....
‘‘ లాక్‌డౌన్‌ కాలంలో గట్టిగా తలుపులు బిగించుకొని బతికారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో నెలకొన్న సంక్షోభం ఒత్తిడికి గురిచేసింది. ఇప్పుడు తలుపులు తెరుచుకున్నాయి. కానీ పొంచి ఉన్న కరోనా ముప్పు  మానసిక ఒత్తిడిని మరింత తీవ్రం చేసింది. దీంతో చాలా మంది  ఆందోళనకు గురవుతున్నారు. డిప్రెషన్‌ లక్షణాలు కూడా పెరుగుతున్నాయి.’ అని చెప్పారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి. లాక్‌డౌన్‌ తొలగిపోయిందనే భరోసా లేదు, పదిమందితో కలిసి తిరిగే పరిస్థితి లేదు. అలాగని ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండలేము.  ముఖానికి మాస్కు, చేతిలో శానిటైజర్, మనిషికి మనిషికి మధ్య దూరం. అయినా సరే వైరస్‌  సోకుతుందేమోననే  భయంతో బతకాల్సి వస్తుంది అని చెప్పారు. లాక్‌డౌన్‌ టైమ్‌లో  పని లేకపోవడం ఒత్తిడి సృష్టిస్తే  ఇప్పుడు వైరస్‌  మరోవిధంగా ఆ  ఒత్తిడిని తీవ్రతరం చేస్తోంది. మరోవైపు పిల్లల వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకొన్నాయి. కానీ  ఇప్పట్లో స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నా చాలా మంది పిల్లలు చదవడం, రాయడంలో నైపుణ్యాన్ని కోల్పోతున్నారు.

‘డాక్టర్స్‌ షాపింగ్‌’....
నిజానికి లాక్‌డౌన్‌ అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావించారు. కానీ లాక్‌డౌన్‌ తరువాతనే కరోనా కేసులు  ఎక్కువయ్యాయి. దీంతో ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. పదే పదే డాక్టర్లను మారుస్తున్నారు. ‘‘ దీనినే మానసిక పరిభాషలో ‘డాక్టర్స్‌ షాపింగ్‌’ అంటారు. ఏ జబ్బు లేకపోయినా డాక్టర్లను సంప్రదించడం. లాక్‌డౌన్‌ కాలంలో కంటే ఇప్పుడే ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి..’’ అని చెప్పారు  ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ రాధిక ఆచార్య. ఆత్మస్ధైర్యం ఒక్కటే పరిష్కారమన్నారు.

అప్రమత్తతే ఆయుధం  
లాక్‌డౌన్‌లో ఉన్న ఒత్తిడి కంటే ఇప్పుడే ఎక్కువగా ఉంది.కాని కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండడమే ఆయుధం. ఇది రియల్‌టైమ్‌.ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను స్వీకరించి ఎదుర్కోవడమే పరిష్కారం.–  డాక్టర్‌ కళ్యాణచక్రవర్తి,మానసిక వైద్య నిపుణులు

ఇమ్యూనిటీ పెంచుకోండి  
రోగనిరోధక శక్తి పెంచుకోవాలి, మానసిక ప్రశాంతత కోసం ప్రతి రోజు యోగ, ప్రాణాయామ చేయాలి. మెదడుకు ఆక్సిజన్‌ సమృద్ధిగా అందడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో కరోనాను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం అలవడుతుంది.  – డాక్టర్‌ రాధిక ఆచార్య,క్లినికల్‌ సైకాలజిస్ట్‌ 

మరిన్ని వార్తలు