రెండువేల నోటు తీసుకోవాలంటే జంకుతున్న జనం

18 Nov, 2019 09:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సత్తుపల్లిలో భారీ డంప్‌

బయటపడ్డాక పరిస్థితి తీవ్రం

వ్యాపార వర్గాల్లోనూ వణుకు

ఆర్‌బీఐ ఆరా..? 
నకిలీ నోట్ల కలవరంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సైతం నివేదిక పంపించాలని సత్తుపల్లి బ్యాంక్‌ అధికారులను ఆదేశించింది. దీంతో ఉలిక్కిపడిన బ్యాంక్‌ అధికారులు ఇటీవల పట్టుబడిన డంప్‌లోని రూ.2వేల నోట్లపై పోలీసులతో సంప్రదింపులు, విచారణ చేపట్టి నకిలీ నోటు కాదని..చిల్ర్డన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరుమీద రూ.2వేల నోటును పోలినవి పట్టుబడ్డాయని తేల్చారు. నకిలీ నోట్లు కాదంటూ ఆర్‌బీఐకు నివేదిక పంపించినట్లు సమాచారం.

సాక్షి, సత్తుపల్లి (ఖమ్మం) : ఇటీవల సత్తుపల్లిలో నకిలీ రూ.2వేల నోట్లు బయటపడడం, పాత రూ.500, రూ.1000నోట్ల కట్టల భారీ డంప్‌ వెలుగుచూడడంతో..నకిలీ నోట్ల చలామణిపై భయం నెలకొంది. సూత్రధారి మదార్‌ వ్యవహారం..ఈ డబ్బుల కట్టల తంతు తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో..నకిలీ, డమ్మీ నోట్లు చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో వ్యాపారులు, జనం రూ.2వేల నోటు తీసుకోవాలంటే జంకుతున్నారు. బాబోయ్‌ రెండువేల నోటా..? ఒకవేళ నకిలీదైతే ఎట్లా? అని కొందరి గుండెలదురుతున్నాయి. ఒకటికి రెండు సార్లు ఆలోచించి, పలుమార్లు పరిశీలించిన తర్వాతే ఇవ్వమంటున్నారు. సత్తుపల్లిలో దొంగనోట్ల డంప్‌లో నకిలీ రూ.2వేలు..ఏకంగా రూ.7కోట్లు పట్టుబడడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. సినిమా స్టైల్‌లో నోట్లను అద్దెలుగా పేర్చి , ఫ్లైవుడ్‌తో తయారు చేసిన డబ్బాలకు అతికించడంతో చూడటానికి పెద్ద డంప్‌లాగా కన్పించడంతో డబ్బులు కట్టలు.. కట్టలుగా పట్టుబడినట్లు ప్రజలు నమ్ముతున్నారు.

ఒక్కసారిగా కోట్లాది రూపాయల రూ.2వేల నోట్లు పట్టుబడ్డాయని ప్రచారంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. దీనికి తోడు రద్దయిన రూ.1000, రూ.500నోట్లు లభించడం కూడా బ్యాంక్‌ అధికారులకు పని కలిపించినట్లయింది. రద్దయిన పాత నోట్ల వివరాలను సైతం బ్యాంక్‌ అధికారులకు పంపించినట్టు సమాచారం. దేశంలోనే తొలిసారిగా వేంసూరు మండలం మర్లపాడులో దొరికిన రద్దయిన పాతనోట్లు రూ.12,11,500లకు సంబంధించి స్పెసిఫైడ్‌ బ్యాంక్‌నోట్స్‌ యాక్టు(ఎస్‌బీఎన్‌) కింద కేసు నమోదు కావడం గమనార్హం. రద్దయిన పాతనోట్లు ఎవరి వద్దయినా ఉంచుకోవాలంటే కేవలం మచ్చుకు పది మాత్రమే ఉండాలని నిబంధన ఉంది. దీనిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నోట్ల రద్దు సమయంలో స్పష్టంగా ప్రకటించింది. 

తీసుకోవాలంటే ఆలోచించాల్సిందే..
రూ.2 వేల నోటు అంటేనే తీసుకోవడానికి వెనుకాముందు ఆడే పరిస్థితి నెలకొంది. ఒకటికి పదిసార్లు రూ.2వేల నోటును పరీక్షించి చూడటం..నమ్మదగిన వ్యక్తి అయితేనే తీసుకునేందుకు ముందుకు వస్తుండటంతో ప్రజల్లో అసహనం రేగుతోంది. అసలు నోటు.. దొంగనోటు.. నకిలీనోటు..డమ్మీనోటు వీటిపై ఉన్న వ్యత్యాసం ఏమిటోనంటూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అసలు నోటుకు పోలిన విధంగా ఉండే నోటును నకిలీనోటు, దొంగనోటుగా పిలుస్తుంటారు. డమ్మీనోటు అసలు నోటులాగే ఉంటూ పేపర్‌లో వ్యత్యాసం, రిజర్వ్‌బ్యాంక్‌ స్థానంలో ఏదో ఒక పేరు పెట్టి మోసాలకు పాల్పడుతుంటారు. ఇటీవల జిల్లాలో పలుచోట్ల నకిలీనోట్లు దర్శనమివ్వడం..బ్యాంకుల్లో గుర్తించి నోటుపై పెన్నుతో గీతలు కొట్టడం చేస్తున్నారు. దీంతో నకిలీ నోట్లు ఎంతో కొంత ఉన్నాయనే ప్రచారానికి బలం చేకూర్చుతుందని కొందరు వాదిస్తున్నారు. 

సత్తుపల్లి ప్రాంతంలో..
దొంగనోట్లు పెద్ద ఎత్తున సత్తుపల్లి ప్రాంతంలోనే పట్టుబడటంతో నిఘా వర్గాలు సైతం ఇంకా ఇలాంటి కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా అంటూ ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. సంఘ వ్యతిరేక కార్యాకలాపాలు చేపట్టే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కదలికలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మదార్‌ ముఠాతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలపై పూర్తి స్థాయిలో అంతర్గతంగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం. దొంగనోట్ల వ్యవహారంతో సంబంధం ఉన్న నిందితులు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న వారెవరో అంటూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 

పెద్ద నోటంటే భయపడుతున్నాం..
సత్తుపల్లిలో రూ.2వేల దొంగనోట్లు పట్టుబడ్డాయనే ప్రచారంతో నోట్లు తీసుకోవాలంటేనే జంకాల్సి వస్తోంది. మాలాంటి వాళ్లకు అసలు నోటు ఏమిటో..నకిలీ నోటు ఏమిటో అర్థం కాదు. అందుకనే రూ.2వేల నోటు తీసుకొస్తే ఇబ్బంది పడుతున్నాం. చిల్లర కూడా ఎవరూ ఇవ్వట్లేదు. 
– ఎండీ.ముబారక్‌ హుస్సేన్, రెడీమేడ్‌ వ్యాపారి, సత్తుపల్లి

కొద్దిగా ఇబ్బందిగానే ఉంది..
మాకు రోజుకు రెండు, మూడు రూ.2వేల నోట్లు వస్తానే ఉంటాయి. ఈ మధ్య కొద్దిగా ఇబ్బందిగానే ఉంటోంది. ఎవరైనా తెలిసిన వాళ్లు ఇస్తే వాళ్లకు చెప్పి మరీ పేరు రాసుకొని తీసుకోవాల్సి వస్తోంది.  
– కాకర్ల జగన్, రైస్‌షాపు, సత్తుపల్లి

మరిన్ని వార్తలు