రాళ్లు వేసిన చోటే పూలవర్షం

7 Dec, 2019 03:57 IST|Sakshi

కొత్తూరు: ‘దిశ’కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత శుక్రవారం ప్రజలు చటాన్‌పల్లి వద్ద పోలీసులపై పూల వర్షం కురిపించారు. పోలీస్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. గత నెల 30న నిందితులను పోలీసులు షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాగా స్థానికులు వేలసంఖ్యలో స్టేషన్‌ వద్దకు చేరుకుని నిందితులకు బహిరంగంగా ఉరి తీయాలి..లేని పక్షంలో తమకు అప్పగించాలని కోరుతూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా స్థానికులు వారిపై రాళ్లు విసిరారు. అందులో ఓ నిరసనకారుడు పోలీసులపై చెప్పు కూడా విసిరాడు. కాగా, శుక్రవారం నిందితులను పోలీసులు చటాన్‌పల్లి సమీపంలో ఎన్‌కౌంటర్‌ చేయడంతో అదే చేతులతో వారిపై స్థానికులు పూలు చల్లారు.

నిందితులకు ఎన్‌కౌంటరే సరైన శిక్ష
‘దిశ’ను హతమార్చిన నలుగురు నిందితులకు ఎన్‌కౌంటరే సరైన శిక్ష అని స్థానికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘తెలంగాణ పోలీసులు హీరోలు..న్యాయం గెలిచింది..దిశ ఆత్మకు శాంతి చేకూరింది.. సీపీ సజ్జనార్‌ సార్‌ డూస్‌ గ్రేట్‌ జాబ్‌’అని నినాదాలు చేశారు. ఉదయం 8 గంటలకే ఎన్‌కౌంటర్‌ వార్త తెలుసుకున్న ప్రజలు, వివిధ సంఘాల వారు, విద్యార్థులు, యువకులు, రాజకీయ నాయకులు ఘటనా స్థలికి చేరుకుని టపాసులు కాల్చారు. పోలీసులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు