రామగుండంలో ‘కరోనా’ దడ!

22 Mar, 2020 07:26 IST|Sakshi
సీసీ కెమెరాలకు చిక్కిన ఇండోనేషియన్లు (ఫైల్‌)

14న రైల్వేస్టేషన్‌ ఎదుట సంచరించిన ఇండోనేషియన్లు

సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

స్థానికంగా వైద్య పరీక్షలు నిర్వహించని అధికారులు

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వ్యాపారులు, ప్రజలు

సాక్షి, రామగుండం: ఈ నెల 14న ఢిల్లీ నుంచి ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో రామగుండం వచ్చిన 10 మంది ఇండోనేషియన్లు కరోనా వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. వారు రామగుండం రైల్వేస్టేషన్‌లో దిగిన తర్వాత సమీపంలో ఉన్న మజీద్‌కు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌ ఎదుట అటూఇటు తిరిగిన దృశ్యాలు సివిల్‌ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఇండోనేషియన్లు గంట పాటు అక్కడ తిరగడం, నమాజ్‌ చేసుకోవడం, తిరిగి అదే ప్రాంతంలో ఎంగేజ్‌ తీసుకున్న టాటాఏస్‌ వాహనంలో కరీంనగర్‌ వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో వారందరికీ కరోనా వైరస్‌ సోకిందన్న విషయం గుప్పుమనడంతో వ్యాపారులు, స్థానిక ప్రజల్లో దడ పుట్టింది. ఇండోనేషియన్లకు కరీంనగర్‌లో ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి, హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అదేవిధంగా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కరీంనగర్‌లో ఇండోనేషియా బృందం బస చేసిన, తిరిగిన ప్రాంతాలపై అధికార యంత్రాంగం ఆంక్షలు విధించింది. 

అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం
రామగుండంలో ఇండోనేషియన్లు తిరిగారని తెలిసినా స్థానికంగా అధికారులు ఎలాంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం లేదు. కనీసం వారు సంచరించిన ప్రాంతాల్లో బ్లీచింగ్‌ చేయకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు సైతం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కనీసం రైల్వేస్టేషన్‌ పరిధిలోని రెండు ప్లాట్‌ఫాంలపై ఎక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని పలువురు అంటున్నారు.

మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు
రైల్వేస్టేషన్‌ ఎదుట ఇప్పటికే మూడు సీసీ కెమెరాలు ఉండగా, ఇండోనేషియన్ల బృందం పర్యటించిన మరుసటి రోజు మరో రెండు హై ఫ్రీక్వెన్సీ కెమెరాలను రామగుండం ఎస్సై మామిడి శైలజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మరో రెండు చోట్ల అదనంగా రెండు కెమెరాలు బిగించేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఏడు సీసీ కెమెరాలను రైల్వేస్టేషన్‌ ప్రవేశ ద్వారంలో ఏర్పాటు చేసేందుకు  నిర్ణయించినట్లు సివిల్‌ పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు