‘బయో’బాధలు..!

23 Mar, 2018 07:38 IST|Sakshi

పడని వేలిముద్రలు..అందని రేషన్‌ బియ్యం

నష్టపోతున్న లబ్ధిదారులు

వీఆర్వో ధ్రువీకరణ ఉన్నప్పటికీ 

అడ్డంకిగా మారిన ఒక శాతం నిబంధన

తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్‌  కార్యాలయాల్లో బాధితుల ఫిర్యాదు

సాక్షి, యాదాద్రి : రేషన్‌ దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం జనవరి 1 నుంచి ఈ పాస్‌ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా సరుకులు తీసుకోవాలంటే  బయోమెట్రిక్‌ యంత్రాల్లో లబ్ధిదారుల వేలిముద్రలను తప్పనిసరి చేసింది. అయితే వయస్సు మళ్లిన వృద్ధులు, రక్తహీనత రోగులు, కష్టజీవులు, రోజువారి కూలీలు చేతి వేళ్ల రేఖలు కనిపించపోవడంతో వారి వేలిముద్రలు బయోమెట్రిక్‌ యంత్రాల్లో పడడం లేదు. జిల్లాలో ప్రతి నెలా వేలాది యూనిట్లకు ఇలాంటి సమస్య తలెత్తుతోంది. ఫలితంగా లబ్ధిదారులకు నెలనెలా ఇవ్వాల్సిన బియ్యం కోటా అందడం లేదు.

వీటికి తోడు సాంకేతిక సమస్యలు, సిగ్నల్స్‌ అందకపోవడం కూడా వేలిముద్రలు పడకపోవడానికి కారణమవుతున్నాయి. శాపంగా మారిన ఒక్క శాతం నిబంధనఅక్రమాల నివారణ కోసం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్‌ విధానం లబ్ధిదారులకు శాపంగా మారుతోంది. వేలి ముద్రలు పడని వారికి వీఆర్వోల ధ్రువీకరణ ద్వారా బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయితే ప్రతి రేషన్‌ దుకాణంలో ఒక్క శాతం మేరకే వీటిని ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నాయి. దీంతో ప్రతి రేషన్‌ దుకాణంలో పదుల సంఖ్యలో వేలిముద్రలు పడని వారు ఉంటున్నప్పటికీ అందరికీ బియ్యం అందడం లేదు. వారందరికీ రేషన్‌ ఇవ్వడం డీలర్లకు ఇబ్బందిగా మారింది. తమకు బియ్యం ఇప్పించాలని లబ్ధిదారులు రేషన్‌ దుకాణం, గ్రామంలోని వీఆర్వో, మండలంలోని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్‌ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు పెట్టుకుంటున్నా వారికి న్యాయం జరగడం లేదు. 

భువనగిరిలో 823 మంది
భువనగిరి పట్టణం, మండల పరిధిలో 36 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వీటిలోని 712 మంది లబ్ధిదారుల వేలిముద్రలు బయోమెట్రిక్‌ యంత్రాల్లో పడడం లేదు. వేలిముద్రలు పడనివారికి ఒక్క శాతం రేషన్‌ ఇవ్వాలన్న నిబంధన ప్రకారం కేవలం 192మందికి మాత్రమే బియ్యం అందుతున్నాయి. మిగతా 520 మందికి బియ్యం నెలనెలా అందడం లేదు. ఈపరిస్థితి జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్‌ దుకాణాల్లో ఉంది. 

అర్హులందరికీ బియ్యం ఇవ్వాలి 
వేలిముద్రలు పడనివారందరికీ నెలనెలా రేషన్‌ బియ్యం ఇవ్వాలి. ఒక్క శాతం నిబంధనతో పేదలందరికీ బియ్యం అందడం లేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేటట్లు చూడాలి.  –చల్లగురుగుల రఘుబాబు, మైఫ్రెండ్‌ సోషల్‌ ఆర్గనైషన్‌ అధ్యక్షుడు

ఆధార్‌ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి 
వేలిముద్రలు రానివారు తమ ఆధార్‌కార్డును ఆధార్‌ సెంటర్‌ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. వేలిముద్రలను కూడా ఆన్‌లైన్‌ చేసుకోవాలి. వేలిముద్రలు రాని వారికి వీఆర్వో ద్వారా బియ్యం, సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో రేషన్‌షాపుకు వీఆర్వోలను కేటాయించాం.  –కొప్పుల వెంకట్‌రెడ్డి, భువనగిరి తహసీల్దార్‌

మరిన్ని వార్తలు