గళం విప్పుతారా?

4 Nov, 2014 23:50 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగే తొలి బడ్జెట్ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేటి నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రవేశపెట్టే తొలిబడ్జెట్ భారీగా ఉండాలనే ఉద్దేశంతో సర్కారు సిద్ధమైంది. ఇందులో భాగంగా 10 జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

 ఈ మేరకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ.. వాటిపై అంశాల వారీగా చర్చించనున్నారు. ఈ క్రమంలో ప్రధాన సమస్యలకు పరిష్కారమార్గాలను జోడించే అవకాశం ఉండడంతో జిల్లా ప్రజానికం ఎమ్మెల్యేపై భారం వేసింది. దీంతో మన ప్రజాప్రతినిధులు సమస్యలపై వాణివినిపించేందుకు సిద్ధమవుతున్నారు.

 రైతు సమస్యలే ప్రధానంగా...
 తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయరంగం డీలా పడింది. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత నాలుగు నెలల కాలంలో జిల్లాలో 15మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఎక్కువ మంది చనిపోయారు. కరువు పరిస్థితులతో పెద్దఎత్తున పంటలు ఎండిపోయాయి. మరోవైపు భూగర్భజలాలు పూర్తిగా అడుగంటి తాగునీటికి సైత ం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో జిల్లాను కరువు ప్రాంతంగా  ప్రకటించాలనే డిమాండ్ ఉంది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పంపింది. తాజాగా శాసన సభ బడె ్జట్ సమావేశాల్లో ప్రతిపక్ష శాసనసభ్యులు ఈ అంశాన్నే ఆయుధంగా చేసుకుని మాట్లాడనున్నారు.

 అటు ఇటుగా మారి..
 జిల్లాలో 14 ఎమ్మెల్యేలుండగా.. అధికార పార్టీ నాలుగు స్థానాల్లో గెలిచింది. ఎనిమిది మంది టీడీపీ సభ్యులు విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు గెలిచారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతమయ్యేందుకు తలపెట్టిన ఆకర్ష్ మంత్రానికి ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గత నెలలో గులాబీ పార్టీలో చేరగా.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య త్వరలో చేరనున్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు ఇరకాటంలో పడ్డాయి. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తమవైపునకు వచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఈక్రమంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు సభలో సర్కారు పట్ల ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

 నిధులు కేటాయింపుపై ఉత్కంఠ..
 కొత్త రాష్ట్రంలో ప్రవేశపెట్టే తొలిబడ్జెట్‌పై జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. రాజధాని చుట్టూ జిల్లా విస్తరించి ఉన్న నేపథ్యంలో అభివృద్ధి అంశం కీలకమైంది. ఇటీవల వర్షాలతో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. మరోవైపు భారీ సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో మైనర్ ఇరిగేషన్‌కు చెందిన కోట్‌పల్లి, లక్నాపూర్, కాగ్నా ప్రాజెక్టులను ఆధునికీకరించాల్సి ఉంది. తాజా బడ్జెట్‌లో వీటికి కేటాయింపులు ఘనంగా ఉండాలని రైతాంగం కోరుకుంటోంది.

తాగు, సాగునీటి శాశ్వత పరిష్కారం కోసం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సర్కారు పచ్చజెండా ఊపింది. గతంలో సర్వే పనులకు నిధులు కేటాయించగా.. తాజా బడ్జెట్లో ప్రాజెక్టు పనులకు కేటాయించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామలం కానుంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేటాయింపులపై స్పష్టత రానుంది.
 
 ఎత్తిపోతలపై మాట్లాడుతా..
 తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ సమావేశాల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ప్రజాప్రతినిధిగా సాగునీరు, తాగునీరు సాధనపై గళం వినిపిస్తా. ప్రభుత్వ పరిశీలనలోఉన్న రంగారెడ్డి- పాలమూరు ఎత్తిపోతలను సాధిస్తే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. - ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
 
 ప్రజా సమస్యలు ప్రస్తావిస్తా..

  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నియోజకవర్గ సమస్యలతోపాటు, జిల్లా సమస్యలు ప్రస్తావిస్తా. ప్రధాన అంశాలకు బడ్జెట్ కేటాయించేలా ప్రభుత్వంపై వత్తితెస్తా. ఇప్పటికే పలు సమస్యలపై ప్రస్తావించేందుకు స్పీకర్‌తో సమయం తీసుకున్నా. వికారాబాద్‌లోని అనంతగిరిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతోపాటు ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు, జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న 22 మంది రైతు కుటుంబాలకు పరిహారం విషయంపై మాట్లాడుతా.

 పరిగి- నంచర్ల రోడ్డు విస్తరణ, హైదరాబాద్- బీజాపూర్ రోడ్డు నాలుగు లేన్లుగా మార్చేందుకు నిధుల కేటాయింపు, వికారాబద్ నుంచి పరిగి మీదుగా మక్తల్ రైల్వేలైన్ ఏర్పాటుకు రాష్ట్ర వాటా నిధులు కేటాయింపు తదితర అంశాలపై బడ్జెట్ కేటాయించేలా సీఎల్పీ హోదాలో అసెంబ్లీలో చర్చిస్తా. - టీ.రామ్మోహన్‌రెడ్డి, సీఎల్పీ సెక్రెటరీ (పరిగి ఎమ్మెల్యే)

మరిన్ని వార్తలు