చీకట్లు నింపిన వెలుగులు

9 Nov, 2018 08:37 IST|Sakshi

దీపావళి పండుగ వేళ విషాదం

నగరంలో బాణసంచా కాలుస్తుండగా ప్రమాదాలు

కంటి చూపు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు  

సరోజిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

గోల్కొండ: దీపావళి పండుగ కొందరు జీవితాల్లో చీకట్లు నింపింది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దాదాపుగా కంటి చూపు కోల్పోయారు. బాణసంచా కాల్చిన సంఘటనలో గాయపడ్డవారు మొత్తం 45 మంది వివిధ రకాల కంటి గాయాలతో సరోజిని ఆసుపత్రిలో చేరారు. వీరిలో 33 మందిని ఔట్‌ పేషెంట్‌ చికిత్స చేసి పంపించి వేశారు. 14 మందిని ఇన్‌ పేషెంట్‌లుగా చేర్చి చికిత్స అందించారు. కాగా వీరిలో ఇద్దరికి శాశ్వతంగా ఒకరికి కంటి చూపు రాదని డాక్టర్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇంటి గేటు ఎదుట టపాకాయలు కాలుస్తుండటం చూస్తున్న వనస్థలిపురానికి చెందిన కృష్ణమాచారికి ఒక టపాకాయ వచ్చి కుడి కన్నుకు తాకింది. అదే విధంగా లాలాపేటలో రిషికేష్‌ (14)కి టపాకాయలు ముఖం మీద పడ్డాయి.

ఇందులో రిషికేష్‌ ముఖానికి తీవ్ర గాయలయ్యాయి. బుధవారం రాత్రి ఇరుగుపొరుగువారి కాల్చిన టపాసుల్లో పేలనివాటిని మాదన్నపేట్‌కు చెందిన సమీర్‌ఖాన్‌ గురువారం ఉదయం వాటిని కాలుస్తుండగా అవి ఒకేసారి పేలి కంట్లో పడ్డాయి. కాగా ఈ సంఘటనలో మదర్సా విద్యార్థి అయిన సమీర్‌ పాషా (9) కనురెప్పలు పూర్తిగా కాలిపోగా ఎడమ కన్నుకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి కోరంటికి చెందిన మైసమ్మ (60) ఆటోలో గోల్నాక నుంచి శ్రీరామ్‌నగర్‌కు వెళ్తుండగా అదే సమయంలో ఆటోలో రాకెట్‌ వచ్చి ఆమె కంటిపై పడింది. కనుగుడ్డుకు తీవ్ర గాయమై రక్త స్రావం కావడంతో ఆమెను సరోజిని ఆస్పత్రికి తరలించారు. మైసమ్మ పరిస్థితి విషమంగా  ఉందని, కంటి చూపు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. అంబర్‌పేట్‌కు చెందిన 6వ తరగతి విద్యార్థి చరణ్‌ (11) టపాకాయలు కాలుస్తుండగా అవి పేలి ముఖంపై పడ్డాయి. దీంతో చరణ్‌ రెండు కళ్లకు గాయాలయ్యాయి. శంషాబాద్‌కు చెందిన కిరాణ షాపు వ్యాపారి రాజు గౌడ్‌ (38) తన కిరాణ షాపులో కూర్చుండి రోడ్డుపై దీపావళి వేడుకలను చూస్తున్నాడు. అదే సమయంలో ఓ రాకెట్‌ వచ్చి అతని ముఖానికి తాకింది. ఈ సంఘటనలో రాజు కళ్లకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ (28)రోడ్డుపై నిలబడి పిల్లలు టపాకాయలు కాలుస్తున్న దృశ్యాలను చూస్తుండగా ఓ టపాసు పేలి ఆయన కుడి కన్నుపై పడింది. దీంతో శ్రీనివాస్‌ కంటికి, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ప్రస్తుతంమెహిదీపట్నంలోని సరోజిని దేవి కంటిఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తలు