రూ.1500 @ పోస్టాఫీస్‌

29 Apr, 2020 08:14 IST|Sakshi

నగదు కోసం జనం భారీ బారులు

రేషన్‌ కార్డులు ఉండి బ్యాంక్‌ అకౌంట్‌లేని వారికి నగదు

24 పోస్టాఫీసుల ద్వారా డబ్బుల చెల్లింపు

నగరంలో లక్షన్నరకు పైగా  కుటుంబాలు  

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ కాలంలో నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వం అందించే రూ.1500ల కోసం నిరుపేద కుటుంబాలు పడరాని పాట్లు పడుతున్నారు. ఆహార భద్రత(రేషన్‌ కార్డు) కలిగి బ్యాంక్‌ అకౌంట్‌ లేని లబ్ధిదారులు మండుటెండల్లో పోస్టాఫీసుల ముందు నగదు కోసం గంటల కొద్ది కిలో మీటర్ల పొడవునా బారులు తీరుతున్నారు. రెండు రోజుల నుంచి నగరంలోని పలు పోస్టాఫీసుల వద్ద ఈ దృశ్యం కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆహార భద్రత కార్డులు కలిగిన నిరుపేద కుటుంబాలకు ఉచిత బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం.. నిత్యావసర సరుకుల కోసం వారి బ్యాంక్‌ అకౌంట్లలో రూ.1500ల నగదు జమ చేసింది. బ్యాంక్‌ అకౌంట్‌ లేని సుమారు లక్షన్నర కుటుంబాలను గుర్తించి వారి నగదు పోస్టాఫీసుల్లో జమ చేసింది. బ్యాంక్‌ అకౌంట్‌ లేని నిరుపేదలకు రేషన్‌ కార్డు నంబర్‌ ఆధారంగా నగదు చెల్లించాలని పోస్టల్‌శాఖను ఆదేశించింది. ఇందుకు పోస్టల్‌ శాఖ నగరంలోని జనరల్‌ పోస్టాఫీసు(జీపీవో)తో కలిపి సుమారు 24 పోస్టాఫీసులను ఎంపిక చేసి నగదు పంపిణీ ప్రక్రియకు ఐదు రోజుల క్రితం శ్రీకారం చుట్టింది.

పంపిణీ చేసే పోస్టాఫీసులు ఇవే..
నగరంలోని జనరల్‌ పోస్టాఫీస్‌(జీపీవో), జూబ్లీహిల్స్, ఫలక్‌నుమా, బహదుర్‌పురా, సైదాబాద్, కాచిగూడ, యాకుత్‌పురా, రామకృష్ణపూర్, ఖైరతాబాద్, హుమాయున్‌నగర్, హిమాయత్‌నగర్, అంబర్‌పేట, ఉప్పల్, కేశగిరి, మోతీనగర్, ఎస్‌ఆర్‌నగర్, లింగంపల్లి, సింగారెడ్డి కాలనీ, కొత్తగూడ, స్నియోసో, మణికొండ, కార్వాన్‌సాహు, సికింద్రాబాద్, తిరుమలగిరి తదితర పోస్టాఫీసుల ద్వారా ఆహార భద్రత కార్డు కలిగి బ్యాంక్‌ అకౌంట్లు లేని లబ్ధిదారులు రూ.1500 నగదు పొందవచ్చు.

నగదు ఇలా..
నగరంలో ఎంపిక చేసిన పోస్టాఫీసుకు వెళ్లి ఆహార భద్రత(రేషన్‌) కార్డు చూపించినా.. లేదా రేషన్‌ కార్డు కొత్త నెంబర్‌ తెలియజేసినా చాలు.. పోస్టల్‌ శాఖ సిబ్బంది వెంటనే బయోమెట్రిక్‌(వెలిముద్ర) తీసుకొని రూ.1500ల నగదు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే రేషన్‌ షాపుల్లో సైతం లబ్ధిదారుల జాబితా అందుబాటులో ఉంచినట్లు సాక్షాత్తు సంబంధిత మంత్రి గంగుల కమలాకర్‌ ప్రకటించారు. వాస్తవంగా ఆహార భద్రత నిబంధన ప్రకారం  కార్డులోని హెడ్‌ ఆఫ్‌ ఫ్యామిలీ(కుటుంబ పెద్ద) మహిళా మాత్రమే నగదు తీసుకునే వెసులుబాటు కల్పించారు.

>
మరిన్ని వార్తలు