అణచివేతను తెలంగాణ ప్రజలు సహించరు

3 Feb, 2015 01:44 IST|Sakshi

 హైదరాబాద్: అణచివేతను తెలంగాణ ప్రజలు సహించరని, ఎంత ప్రజాస్వామ్యం ఉంటే అంత స్వేచ్ఛ ఉంటుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) ఆధ్వర్యంలో ‘టీవీవీ మహాసభల’పై నిర్బంధాన్ని ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి సంఘాల మీద దాడి చేసినా, అణచివేసినా ఎవరు ఏమి ప్రశ్నించరని భావించే నేతలకు కనువిప్పు కలగాలన్నారు. ఒక్క విద్యార్థి సంఘాన్ని అణచివేస్తే అన్ని విద్యార్థి సంఘాలు ఐక్యం కావటం శుభపరిణామమన్నారు. ఇలాగే  కొనసాగితే ఉద్యమం చేయాల్సి వస్తుందని,  ప్రజల్ని మరో ఉద్యమంలోకి నెట్టవద్దని కోరారు. మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు జీవన్‌కుమార్ మాట్లాడుతూ  విద్యార్థును నిర్బంధంలోకి నెట్టటం హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ  సమస్యపై సదస్సు నిర్వహించుకునే విద్యార్థ్ధి సంఘంపై నిర్బంధంరాజ్యాంగానికి విరుద్ధమన్నారు. టీవీవీ అధ్యక్షుడు ఎన్.మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీవీవీ కార్యదర్శి ఆజాద్, ప్రొఫెసర్ చక్రధర్ రావు, టీపీఎఫ్ అధ్యక్షుడు పులిమామిడి మద్దిలేటి, పలు ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు